తొర్రూరు, జూన్ 17 : కుక దాడిలో 42 రోజుల శిశువు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. మడిపల్లికి చెందిన రేణుకకు నెల్లికుదురు మండ లం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకన్నతో వివాహమైంది. ప్రసవం కోసం రేణుక తల్లిగారింటికి రాగా 42 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం 8 గంటలకు రేణుక, ఆమె తల్లి వెంకటమ్మ బయట పనుల్లో ఉన్న సమయంలో ఓ కుక్క ఇంట్లోకి చొరబడింది. మం చంలో నిద్రిస్తున్న శిశువును తలపై తీవ్రంగా గాయపర్చింది. ఆ పసికందు ఏడుపు శబ్దం విని వారిద్దరు ఇంట్లోకి వెళ్లి చూడగా తీవ్రగాయాలతో కనిపించాడు. వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శిశువు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న క్రమంలో కుక్క వచ్చి బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.