హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపేట, తాటిగిండాల గ్రామాలకు చెందిన కుటుంబాల తరలింపుకోసం అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కుటుంబాలను నాగర్‌కర్నూల్-కొల్లాపూర్‌లోని బాచారం తదితర ప్రాంతాలకు తరలించే అవకాశముంది. ఈ గ్రామాల తరలింపు ద్వారా దాదాపు 1192 హెక్టార్ల అటవీ భూములకు భద్రత లభిస్తుందని చెబుతున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీకి అటవీశాఖ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సమర్పించారు. అక్కడి నుంచి రాష్ట్ర కమిటీకి, తుది ఆమోదం కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)కి పంపుతామని వెల్లడించారు.
కవ్వాల్ ఫారెస్ట్‌లోని రాంపూర్, మైసారం నుంచి 94 కుటుంబాలను మడిపడగకు తరలించినట్టు వివరించారు. నిర్వాసితులకు రూ.15లక్షల నగదు పరిహారం లేదా భూమిని అందించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి నగదు లేదా భూమిని ఎంపిక చేసుకునే అవకాశం లబ్ధిదారుకే ఇవ్వనున్నారు. ఇప్పటికే గుర్తించిన భూమిని అభివృద్ధి చేసి రోడ్డుమార్గం, నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలని వివిధ శాఖలను ఆదేశించారు. ఎన్టీసీఏ ఆమోదం తర్వాత నెలలో పునరావాస కసరత్తు ప్రారంభమవుతుందని తెలిపారు. మానవ-వన్యప్రాణుల సంఘర్షణ, జీవవైవిధ్య అభివృద్ధి, స్థానికుల సంక్షేమం, ముఖ్యంగా చెంచుల సంక్షేమం కోసం నాలుగు గ్రామాల కుటుంబాలను ఫారెస్ట్ నుంచి బాచారం తరలించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. తొలిదశలో నాలుగు గ్రామాలవారిని, రెండోదశలో వట్వార్పల్లి నుంచి కొందరిని తరలిస్తామని చెప్పారు.
గురువారం ఉదయం అనంతగిరి పుష్కరిణి సమీపంలో తిరుగాడిన ఓ జింకను వీధికుక్కలు వేటాడి పీక్కుతిన్నాయి. దీన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు కూడా బయట ఆడుకుంటూ గడుపుతుంటారని కుక్కలు పిల్లలపై దాడిచేస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. అనంతగిరిలో వీధికుక్కలపై అటవీశాఖ అధికారులు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. కుక్కల బారినుంచి జింకలు, ఇతర అటవీ జంతువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.