రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం మంచిదికాదంటారు. ఆ సత్యాన్ని ఎరిగిన కేసీఆర్.. రైతు సంక్షేమమే లక్ష్యంగా పదేండ్లు రాష్ర్టాన్ని పాలించారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతా తలకిందులైంది. సగటున రోజుకో రైతు తనువు చాలిస్తున్నాడు. రుణమాఫీ అరకొరగా కావడంతోపాటు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సా యమూ అందడం లేదు. సాగునీటి ఇక్కట్లూ తోడ వడంతో దిగుబడి పడిపోయింది. అప్పుల పాలై రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
Telangana | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పులబాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరింత ఆజ్యం పోస్తున్నది. పెట్టుబడి సాయం ఇవ్వక, ఇస్తానన్న రుణమాఫీని అందరికీ అమలుచేయక పరోక్షంగా రైతుల మరణాలకు కారణమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 402 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు బలవన్మరణాలకు పాల్పడిన రైతుల జాబితాను ఆదివారం తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం 2023 డిసెంబర్ 9 నుంచి ఈ ఏడాది జనవరి 19 వరకు 402 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 408 రోజుల్లో సగటున రోజుకొక రైతు చొప్పున ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వాస్తవాలను బహిర్గతం చేసింది.
ప్రభుత్వ దగాతో దిగాలుపడిన రైతులు
ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందంటూ రైతులు ఏకంగా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల పంటలకు రూ.500 బోనస్, కౌలు రైతులకు ఏటా రూ.12 వేలు, భూమిలేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు.. ఇలా అనేక హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా నేతలంతా దేవుళ్లపై ఒట్లు వేసి మరీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కన పెట్టడంతో రైతులపై మొదటి పిడుగు పడింది. గద్దెనెక్కగానే యాసంగి పంటకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో పెట్టుబడి సాయం అందక రైతులు మరింత దిగాలుపడిపోయారు.
ఫలితంగా రైతులపై అప్పులభారం పెరిగింది. ఎన్నికలకు ముందు రైతుబంధు వేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలపాటు రైతులకు నగదు ఇవ్వకుండా కాలయాపన చేసింది. కాళేశ్వరాన్ని పక్కనబెట్టడం, ఇతర ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం కారణంగా చెరువుల్లో నీళ్లు లేక భూగర్భజలాలు అడుగంటాయి. ఫలితంగా సాగునీరు అందని దుస్థితి నెలకొన్నది. వానకాలం పంటకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో అప్పుల భారం మరింత పెరిగిపోయింది. దీనికితోడు పంట కొనుగోళ్లలో జాప్యంతో రైతులను సర్కారు మరింత ఇబ్బంది పెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
సంబరాల సీజన్లో మరణాలు
బీఆర్ఎస్ విడుదల చేసిన గణాంకాలను విశ్లేషిస్తే.. అత్యధికంగా నిరుడు నవంబర్‌లో 48 మంది, డిసెంబర్లో 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సాధారణంగా వానకాలం పంటకు దసరా తర్వాత కోతలు మొదలవుతాయి. నవంబర్, డిసెంబర్లో పంట రైతుల చేతికి వస్తుంది. ఈ సమయంలో గ్రామాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వానకాలం పంటకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, పంట కొనుగోళ్లలో ఇబ్బందుల కారణంగా పెట్టుబడి కూడా రైతులకు మిగలలేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందుకే నిరుడు నవంబర్, డిసెంబర్లో అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయని విమర్శిస్తున్నారు.
మెదక్‌లో అత్యధిక మరణాలు
బీఆర్ఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అత్యధిక రైతు ఆత్మహత్యలు మెదక్ జిల్లాలో నమోదయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 62 మంది అన్నదాతలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ 33, హనుమకొండ 26, మహబూబాబాద్ 25, వరంగల్ 24 మంది చొప్పున నమోదయ్యాయి. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్తున్నా.. తమ రుణంమాఫీ కాలేదు మహాప్రభో అంటూ వేలాది మంది రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో అప్పులభారం పెరిగి, ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఏకంగా బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి అన్నదాతల ఆత్మహత్యలకు గత కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అత్యధిక ఆత్మహత్యలు నమోదైన 10 జిల్లాలు