హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ‘పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యాని కి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అగాధంలోకి జారుకోకుండా చూడాలి’ అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనాకాలంలో సంకల్పం పెట్టుకున్నారు. ఆ మహత్తర ఆశయంతో వైద్యరంగంలో నాడు కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే-2026 స్పష్టంచేసింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో వైద్యారోగ్యశాఖలో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, వాటి సత్ఫలితాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేసీఆర్ చూపిన చొరవను ఈ సర్వే రుజువు చేసింది. కే సీఆర్ పాలనా ప్రగతిపై ప్రభుత్వం విడుదల చే సిన ఆ సర్వే అంకెలు సహా సవివరంగా వెల్లడించింది. పదేండ్లలో అభివృద్ధే జరుగలేదని కాంగ్రె స్ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమేనని ఈ సర్వే నిగ్గు తేల్చింది.
టీ-డయాగ్నొస్టిక్స్‌తో అత్యుత్తమ సేవలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే నాటికి టీవీవీపీ పరిధిలో 102 దవాఖానలు ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 184 దవాఖానలు ఉన్నట్టు సామాజిక ఆర్థిక సర్వే పేర్కొన్నది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చొరవతో టీవీవీపీ దవాఖానలు పెరుగడంతోపాటు బెడ్ల సంఖ్య సైతం 7,180 నుంచి 12,760కి చేరింది. కేసీఆర్ చొరవతో భారత ప్రజారోగ్య ప్రమాణాల(ఐపీహెచ్ఎస్) ప్రకారం.. ‘ప్రతి వెయ్యి మందికీ ఒక పడక’ ఉండాలన్న నిబంధనను తెలంగాణ అధిగమించింది. బీఆర్ఎస్ పాలనలో నాటి వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో టీవీవీపీని ‘డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్‌హెచ్‌ఎస్)’గా చేసే ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆ టీవీవీపీని డీఎస్హెచ్ఎస్గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య పరీక్షలు భా రం కాకూడదనే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్ర వేశపెట్టిన టీ-డయాగ్నొస్టిక్స్ కూడా సత్ఫలితా లు ఇస్తున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే తెలిపిం ది. 33 జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 21 మినీ హబ్స్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. శాంపిళ్లను సేకరించిన తర్వా త 12 గంటల్లోనే రిపోర్టును పేషెంట్లకు అందజేస్తున్నట్టు తెలిపింది. పాథాలజీలో భా గంగా 134 రకాల పరీక్షలతో రేడియాలజీ సేవలందిస్తున్నట్టు వివరించింది.
2021 నుంచే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు
2021 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్రంలో 1.49 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్, 74లక్షల మందికి రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చేసినట్టు ఈ సర్వే వెల్లడించింది. స్పెషలైజ్డ్ చికిత్సకు ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు పేషెంట్లను రిఫర్ చేస్తున్న ట్టు వివరించింది. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌కు టీ-డయాగ్నొస్టిక్స్లలో మామోగ్రఫీ పరీక్షలు చేస్తున్నట్టు వివరించింది. కీమో థెరపీ చికిత్సకు పేషంట్లను 35 జిల్లాల్లో ఏర్పాటుచేసిన క్యాన్సర్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నట్టు పేర్కొన్నది.
అమ్మ ఒడి, కేసీఆర్ కిట్‌తో సత్ఫలితాలు
కేసీఆర్ హయాంలో 2017 జూన్ 3న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి(102 స ర్వీసులు), కేసీఆర్ కిట్ పథకాలు సత్ఫలితాలు ఇచ్చినట్టు తెలిపారు. అమ్మఒడి ద్వారా గర్భిణులకు అత్యవసర సమయాల్లో పిక్ అప్, డ్రా ప్ ఆఫ్ సేవలు అందిస్తున్నట్టు సర్వే స్పష్టం చే సింది. ప్రసవాల తర్వాత మాతా, శిశువులకు సైతం ఈ సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నా టికి మొత్తం 300 వాహనాలు అందుబాటు లో ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 7.90 లక్షల మంది గర్భిణులు ఈ సేవలను వినియోగించుకున్నట్టు ఈ సర్వే తెలిపింది. మాతా శిశు సంరక్షణ కోసం నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ ద్వారా 2023లో శిశు మరణాల రేటు తగ్గినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే నాటికి ప్రతి వెయ్యి మందికీ శిశు మరణాల రేటు(ఐఎంఆర్) 35గా ఉండగా, 2023 లో ఇది 18కి తగ్గినట్టు తెలిపింది. దేశంలో శిశు మరణాల రేటు 25గా ఉన్నట్టు వెల్లడించింది.
కేసీఆర్ పాలన.. వైద్యవిద్యకు ‘స్వర్ణయుగం’
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో వైద్యవిద్య స్వర్ణయుగంలా విరాజిల్లుతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. ‘జిల్లాకో మెడికల్ కాలేజీ పాలసీ’ అద్భుత ఫలితాలు ఇస్తున్నట్టు ఈ సర్వే కితాబు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు తెలిపాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటి సంఖ్య 4,140కి పెరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వే-2026 స్పష్టంచేసింది. పీజీ సీట్లు 1,266, సూపర్ స్పెషాలిటీ సీట్లు 107కి పెరిగినట్టు సర్వే తెలిపింది. నాడు కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని మాత్రమే ఏర్పాటుచేసింది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి 2026-27 వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించినా.. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల కల్పనలో జాప్యం సవాల్‌గా మారింది. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు తాజా బడ్జెట్లోప్రభుత్వం ఎలాంటి రూట్‌మ్యాప్ చెప్పకపోవడం గమనార్హం.
4,018 బెడ్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖ ముఖచిత్రాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయాలని సంక్పలించారు. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలోని సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ దవాఖానలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో దవాఖానలో 1,000 బెడ్ల సామర్థ్యంతో నిర్మించేందుకు నాడు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 2,018 బెడ్ల సామర్థ్యంలో ఏర్పాటు చేసేందుకు అంకురార్పణ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 4,018 బెడ్లు అందుబాటులోకి తేవాలని సంక్పల్పించారు. ఇదే అంశాన్ని సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పొందుపర్చింది. వైద్యశాఖలో మౌలిక వసతులు కల్పించేందుకే నాడు సూపర్ స్పెషాలిటీ ప్రాజెక్టులు చేపట్టినట్టు వెల్లడించింది.