హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2035నాటికి 40వేల మెగావాట్ల గ్రీన్పవర్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. సోమవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన నాలుగో ప్రపంచ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమ్మేళనానికి భట్టి రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సదస్సులో భట్టి వివరించారు. ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక కారిడార్లు, ట్రిపుల్ ఆర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతున్నదని, ఇవి గ్రీన్‌పవర్ ఉత్పత్తికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రంలో 1500 నుంచి 3వేల మోగావాట్ల హైడ్రోజన్, జియోథర్మల్, 250 మెగావాట్ల మినీ హైడల్ విద్యుదుత్పత్తికి అవకాశముందని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థల ప్రతినిధులను భట్టి విక్రమార్క కోరారు. సమావేశానికి హాజరైన గిజ్, టాటా పవర్, సెంకార్బ్, వెల్స్పన్, రెన్యూపవర్, ఇండియన్ ఆయిల్, ఎన్‌హెచ్‌పీసీ, వోఎన్వైఎక్స్, హీరోపవర్, ఊర్జా ఎనర్జీ, కేజీపీఎం సంస్థల ప్రతినిధులతోనూ భట్టి భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం వెంట విద్యుత్తు సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు.