హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇదో సరికొత్త విప్లవమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. దళితబంధుతో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారబోతున్నదని అన్నారు. ఈ నెలాఖరులోగా 40 వేల కుటుంబాలకు దళితబంధు సొమ్ము అందజేస్తామని చెప్పారు. శాసనసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర కీలకం. మా పార్టీలో కూడా చాలామంది దళిత పిల్లలు ఉన్నరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరు. కిశోర్, బాల్క సుమన్‌తోపాటు కొందరు దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు నా దగ్గరికి వచ్చి.. రైతుబంధు ఇస్తున్నరు మంచిగున్నది. కానీ మాకు భూములే లేవు గదా మరి మాకెట్ల వస్తదని బాధను వ్యక్తపరిచారు. దళితుల కోసం ప్రత్యేకంగా ఏమైనా చెయ్యాలని అడిగారు. దేశంలోనే విప్లవం తీసుకొచ్చే మహత్తర పథకం దళితబంధును తీసుకొచ్చినం. బడ్జెట్లో దీనికోసం ప్రత్యేక స్థానం కల్పించినం. ఈ నెలాఖరులోపు 40 వేల కుటుంబాలకు డబ్బులు రిలీజ్ చేస్తం. దీంతో ఈ ఏడాది 2 లక్షల మందికి ఈ పథకం వర్తింపజేసినట్టు. ఇలాగే ప్రతిఏటా 2 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తాం.
దళితబంధు అమలులో ఎటువంటి ఆంక్షలు లేవు. బ్యాంకులతో టయప్ లేదు. రూ.10 లక్షలు నేరుగా ఇస్తాం. వందశాతం గ్రీన్‌చానల్‌లో డబ్బులిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం ఇది. రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లతో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసినం. నియోజకర్గంలో ఉండే దళితబంధు కమిటీలే దీనికి కర్తలు. దళితబంధు అమలుతోపాటు దళిత రక్షణ నిధి కూర్పునకు కూడా ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. ఆ నిధి ఎప్పటికప్పుడు జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎస్సీ వెల్ఫేర్ మంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మంత్రులు జిల్లాల్లో, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో దీన్ని విజయవంతం చేయాలి. దళితబంధుతో దేశానికి మనమే టార్చ్‌బేరర్‌గా మారబోతున్నం. దళితులతోపాటు గిరిజన వర్గాల్లో పేదలు ఉన్నరు. వాళ్ల సమస్యకు కూడా పరిష్కారం కావాలి. అందరికంటే అట్టడుగున ఉన్న వారిపై ముందు శ్రద్ధ పెట్టినం. ఏ సహాయం అందకుండా వివక్షకు గురైన దళితులతోనే మొదలు పెట్టినం. దశలవారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తాం.
దేశ తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం. సిక్కిం మనకంటే చాలా చిన్న రాష్ట్రం. 0.1 శాతం మాత్రమే మనకంటే ముందు ఉన్నది. కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మనదే అగ్రస్థానం. మన ఏడేండ్ల శ్రమకు ప్రతిఫలం ఇదంతా. దేశంలోని రాష్ర్టాల మీద 2021లో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్వే నిర్వహించింది. దీన్ని ఆర్బీఐ వెలువరించింది. ఇందులో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇదంతా ఉత్తగనే రాలే. ఇందులో పోలీసు డిపార్ట్మెంట్ కృషి గొప్పది. డీజీపీ నేతృత్వంలో పోలీసుల పనితీరు అద్భుతం. లా అండ్ ఆర్డర్ మంచిగ ఉన్నది కాబట్టే పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడుతున్నది. నాలుగు రూపాయలు పెడితే పది రూపాయలు వస్తయి అంటేనే కదా ఎవరైనా వచ్చేది. పొద్దున లేస్తే జగడం పెడతం. లొల్లి లొల్లి ఉంటదంటే ఎవరైనా వస్తరా? మంచి పోలీసు వ్యవస్థ ఉన్నచోట శాంత భద్రతలు మంచిగ ఉంటయ్. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్న. తెచ్చిన అప్పులను జాగ్రత్తగా చెల్లించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. పతార.. మంచిగుంటేనే ఎవరైనా మనదిక్కు చూస్తరు. 40 సంవత్సరాల బాండ్స్ కూడా అమ్ముడుపోయే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అప్పుల్లో మనది 24వ రాష్ట్రం. పెరిగిన సంపద ఫలితాలు మన ప్రజలు చూస్తా ఉన్నరు. తెలంగాణ అభివృద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటది.