అడవులను పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సీఎఫ్ఈ (కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్) అనుమతి తీసుకున్నారు. మినహాయింపు ఉన్న చెట్ల మాటున అన్నిరకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు.
-హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో కేంద్ర సాధికార కమిటీ
HCU Lands | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నందున వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి, పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని, చట్టాలను ఉల్లంఘించారని పేర్కొన్నది. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు కాకుం డా కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకొని, మినహాయింపు ఉన్న చెట్ల పేరిట అన్నిరకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ నెల 10న హైదరాబాద్‌కు వచ్చిన సిద్ధాంత దాస్ నేతృత్వంలోని సాధికార కమిటీ హెచ్‌సీయూలోని భూములు, చెట్ల నరికివేతను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
విద్యార్థులు, పర్యావరణవేత్తలు, బీఆర్ఎస్ నేతల నుంచి వివరాలు సేకరించింది. పలు శాఖల అధికారులతో స మీక్ష నిర్వహించింది. పర్యటనలో సేకరించిన అంశాల మేరకు కమిటీ సుప్రీంకోర్టుకు మంగళవారం నివేదికను సమర్పించింది. ప్రధానంగా వర్సిటీ భూముల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో వందలాది బుల్డోజర్లతో జరిగిన పర్యావరణ విధ్వంసం, చట్టాల ఉల్లంఘన, దాని వెనుక కుట్రలను సీఈసీ నివేదికలో వివరించింది. రికార్డులను పరిశీలిస్తే 400 ఎకరాల భూములు హైదరాబాద్ వర్సిటీకే చెందినవిగా కనిపిస్తున్నదని కీలకమైన అంశాన్ని పొందుపరిచింది. ఇంతటి విధ్వంసానికి పాల్పడిన టీజీఐఐసీకి అసలు పూర్తిస్థాయిలో భూ యాజమాన్యహక్కులే లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు 69 పేజీల నివేదిక సమర్పించింది.
సుప్రీంకోర్టు జోక్యం.. కమిటీ నివేదక
హెచ్‌సీయూ చెందిన భూముల్లో పెద్ద ఎత్తున చెట్ల నరికివేతతో పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వరుస సెలవు దినాలను ఆసరాగా చేసుకొని ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారని వచ్చిన కథనాలను అమికస్ క్యూరీ పరమేశ్వర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల 30న మొదలైన చెట్ల నరికివేత 4రోజుల పాటు కొనసాగింది. హైకోర్టు స్టే విధించినా పనులు ఆగలేదు. జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ నెల 3న హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అనంతరం రిజిస్ట్రార్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పాటు సాధికార కమిటీని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు అమికస్ క్యూరీతో రిట్ పిటిషన్ వేయించింది.
ఉల్లంఘనలపై తూర్పారబట్టిన కమిటీ
సాధికార కమిటీ తన నివేదికలో భాగంగా పరిశీలనల ‘ముగింపు (కన్‌క్లూజన్)’లో పొందుపరిచింది. ఇందులో ప్రధానంగా చట్టాల ఉల్లంఘన ఎలా జరిగిందో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం.. టీజీఐఐసీ తీరును తూర్పారబట్టింది. ‘అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో టీజీఐఐసీ అనవసరమైన తొందరపాటు చర్యలు చేపట్టింది. అడవిలా ఉన్న ప్రాంతాలు కూడా అటవీ చట్టం-2023లోని సెక్షన్ 1ఏ కిందకు వస్తాయని, ఆ ప్రాంతాలను అటవీయేతర అవసరాలకు మార్చడం, పచ్చదనాన్ని తొలగించడం సరికాదని 4.3.2025న అశోక్‌కుమార్ శర్మ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను పాటించలేదు. టీజీఐఐసీ ‘వృక్షాల తొలగింపు’నకు టెండర్లు పిలిచి ఆ పనిని డెల్టా గ్లోబల్ సర్వీసెస్‌కు అప్పగించింది. ఈ మేరకు సదరు సంస్థ భారీ యంత్రాలతో వృక్షాలు, మొక్కలను నరికివేసింది. భారీ యంత్రాలతో యుద్ధప్రాతిపదికన చెట్ల నరికివేత చేపట్టారు. పర్యావరణవేత్తలు, విద్యార్థులు, ఇతరుల నుంచి వచ్చే నిరసనలు అవరోధం కాకుండా ఉండటంతో పాటు న్యాయపరమైన ప్రక్రియలన్నింటినీ ఉల్లంఘించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి రేయింబవళ్లు (రౌండ్‌ది క్లాక్) పనులు చేసినట్టుగా ఇక్కడి పరిస్థితులు బట్టి తెలుస్తున్నది. వాస్తవానికి ప్రజా ప్రయోజన కోణంలో ప్రజల భాగస్వామ్యంతో జరగాల్సిన ఈ ప్రక్రియను న్యాయపరమైన చర్యలు చేపట్టకుండా రహస్యంగా, బలవంతంగా పోలీసు బల ప్రయోగంతో చేశారు. ఇది ముమ్మాటికీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టు వెంటనే ఈ చర్యలపై దృష్టిసారించాలి’ అని నివేదికలో పేర్కొన్నది.
టీజీఐఐసీ యాజమాన్య హక్కు వివాదాస్పదమే!
అపారమైన పర్యావరణ, విద్య, ఆర్థిక విలువలున్న ఈ భూములు యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయని, ఇక్కడ అరుదైన శిలా నిర్మాణం, సహజసిద్ధమైన నీటి వనరులు, జీవ వైవిధ్యం ఉన్నాయని సీఈసీ నివేదికలో స్పష్టం చేసింది. ‘ఇక్కడ కబ్జాలు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భారీ యంత్రాలతో పచ్చదనాన్ని తొలగించిన ప్రాంతం ఎంతో సహజసిద్ధమైన అడవిని పోలి ఉంటుందని అర్థమవుతుంది. కానీ అలాంటి అటవీ ప్రాంతాన్ని కాపాడకుండా పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘించిమరీ చెట్లను నరికివేశారు. ముఖ్యంగా ఈ 400 ఎకరాలు తమదేనంటున్న టీజీఐఐసీకి ఇంకా పూర్తిగా యాజమాన్య హక్కులు రాలేదు. చారిత్రక రికార్డులు, న్యాయ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలిస్తే ఒప్పందం ప్రకారం ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకే చెందుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ భూముల్లో విద్యాయేతర అవసరాలకు వినియోగించడాన్ని నివారించాలి. అందుకే టీజీఐఐసీకి యాజమాన్య హక్కు అనేది న్యాయపరంగా వివాదాస్పదమే అయినందున ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరమున్నది. ఇలాంటి వివాదాస్పదమైన భూములను తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ తరుణంలో భూములను మూడో వ్యక్తి ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినట్టయితే అది ప్రజల ఆస్తులను ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుంది’ అని సీఈసీ అభిప్రాయపడింది.
సమగ్ర విచారణకు ఆదేశించండి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన రూ.2,374.02 ఎకరాల భూమి రికార్డుల్లో ‘కంచ అస్తాబల్ పోరంబోకు సర్కారీ’గా నమోదై ఉన్నదని నివేదికలో పేర్కొన్న సీఈసీ.. ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన భూములు అడవికి ఉండే అన్నిరకాల లక్షణాలను కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ భూముల్లో చెట్ల సాంద్రత లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సాధికార కమిటీ తుది సిఫార్సులను కోర్టుకు సమర్పించనున్నదని తెలిపింది. ప్రస్తుతం ఇస్తున్న నివేదికలో అత్యంత కీలకమైన సిఫార్సులను చేసిన కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారుల నుంచి అనేక రకాల డాక్యుమెంట్లు కమిటీకి అందాల్సి ఉన్నదని తెలిపింది. చెట్లు నరికివేసిన ప్రాంతంతో పాటు మిగిలిన భూములను కూడా అటవీ ప్రాంతంగా గుర్తించడం, చెట్ల నరికివేతకు సంబంధించి విధి నిర్వహణలో వైఫల్యం చెందిన అధికారుల వివరాలతో తుది నివేదికను సమర్పించనున్నట్టు చెప్పింది. ఇందుకు నాలుగు వారాల గడువు కావాలని సుప్రీం కోర్టును కోరింది.
కాగా తాజా నివేదికలో సుప్రీంకోర్టుకు సెంట్రల్ సాధికార కమిటీ చేసిన సిఫార్సులు ఇవి..
వివిధ మార్గాల్లో సీఈసీ సమాచార సేకరణ
సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఈసీ వివిధ రూపాల్లో సమాచారాన్ని సేకరించింది. ప్రశ్నావళిని రూపొందించి ఈ-మెయిల్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, సైబరాబాద్ సీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీఎఫ్‌వో, ఇతర అధికారులకు పంపింది. క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఈ నెల 4న సూచించింది. ఆ మేరకు వంద ఎకరాల్లో చెట్ల నరికివేత జరిగిందంటూ పలు అంశాలపై నివేదిక ఇచ్చింది. చెట్ల నరికివేతపై రెండు ఫొటోలు కూడా జతచేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీ కూడా సీఈసీ ప్రశ్నావళిపై తమ సమాధానాలు పంపారు. ఇంకా పలు డాక్యుమెంట్లు కూడా అధికారుల నుంచి రావాల్సి ఉన్నదని సీఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇది పర్యావరణానికే గొడ్డలి పెట్టు
కంచ గచ్చిబౌలి భూములు అత్యంత విలువైనవని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని వర్సిటీకి చెందిన ఈ భూములను ముక్కలు చేసి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా సీఈసీ నివేదికలో పేర్కొన్నది. ‘అందుకు కొనసాగింపుగానే ఇప్పుడు ప్రజా ప్రయోజనాలు, విద్యాభివృద్ధి, ఇతర పర్యావరణహితానికి భిన్నంగా ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ భూము ల్ని తాకట్టు పెడుతున్నట్టుగా ఉన్నది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే చెట్ల నరికివేత అనేది సందేహాస్పదంగా అనిపిస్తున్నది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితి లేనందున, వారితో విచారణ అవసరంలేదు. అందుకే దీనిపై ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పారదర్శకంగా విచారణ చేయించాల్సిన అవసరమున్నది. సదరు ఏజెన్సీ కేవలం చెట్ల నరికివేత కోణంలోనే కాకుండా ఈ భూములను తాకట్టు పెట్టి మూడో వ్యక్తి చేతికి భూముల యాజమాన్య హక్కు లు ఇవ్వడం, అందుకు సంబంధించిన నిర్ణయాలు, వాటి వెనక ఉన్న ఉద్దేశాలపైనా విచారణ చేపట్టాల్సిన అవసరమున్నది.
మొత్తం ఈ చెట్ల నరికివేత అనేది కేవలం భూములను చదును చేయడం కోణంలోనే కాకుండా పాలనలో తీవ్ర సంక్షోభం, సంస్థాగత స్వయం ప్రతిపత్తి, పర్యావరణపరంగా జవాబుదారీతనం వంటి కోణాల్లో చూడాలి. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభు త్వ సంస్థల సమగ్రత, సహజవనరుల వారసత్వం దెబ్బతినకుండా ఉండేందుకు పారదర్శకమైన విచారణ చేపట్టాల్సిన అవసరమున్నది. పర్యావరణంగా ఇలాంటి సున్నిత ప్రాంతాలను పరిరక్షించే అంశాల్లో సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యతాయుత స్థానంలోని రాష్ట్ర ప్రభుత్వం సందేహాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తుంది. ఈ చెట్ల నరికివేత అనేది కేవలం అధికార దుర్వినియోగం కిందకే రాదు.. పర్యావరణం, సుస్థిరాభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటిది. అందుకే ప్రస్తుత, భావితరాల కోసం బాధ్యతాయుతమైన పాలన, పర్యావరణాన్ని పరిరక్షించడమనేది చాలా ముఖ్యం’ అని కమిటీ నివేదికలో స్పష్టంచేసింది.
చెట్ల నరికివేతతో విధ్వంసమే
ఈ నెల 10న హైదరాబాద్‌కు వచ్చిన సీఈసీ రాష్ట్ర అధికార యంత్రాంగంతో కలిసి హెచ్సీయూకు వెళ్లినట్టు నివేదికలో పేర్కొన్నది. ఆ సమయంలో 400 ఎకరాలను స్వాధీనం చేసుకున్న టీజీఐఐసీ మొదటి దశలో భాగంగా 122 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని, అందులో భాగంగానే భారీ యంత్రాలతో చెట్ల నరికివేతకు పాల్పడిందని వెల్లడించింది. అటవీ శాఖ పీసీసీఎఫ్ చెప్పిన మేరకు.. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు తీసుకొని చెట్ల నరికివేత చేపట్టారని, అందుకు తీసుకున్న చర్యలను వివరించినట్టు సీఈసీ తన నివేదికలో పొందుపరిచింది. కాగా చిలుకూరు ఎఫ్ఆర్వో ఈ నెల 3న ఆ ప్రదేశాన్ని పరిశీలించగా.. మినహాయింపులేని 125 రకాల చెట్లను నరికివేసినట్టుగా గుర్తించారని, ఈ మేరకు కేసు నమోదు చేశారని పీసీసీఎఫ్ చెప్పినట్టు తెలిపింది. అటవీ శాఖ అధికారుల రికార్డుల ప్రకారం 1524 చెట్లు నరికివేయగా.. వాటిలో 1399 మినహాయింపు క్యాటగిరీలో ఉన్నాయని, ఈ క్రమంలో అధికారులు మూడు జేసీబీలను కూడా సీజ్ చేసినట్టు చెప్పారని వెల్లడించింది.
టీజీఐఐసీ డెల్టా గ్లోబల్ సర్వీసెస్ ద్వారా భారీ ఎత్తున చెట్ల నరికివేతకు పాల్పడినట్టుగా తాము గుర్తించినట్టు కమిటీ నివేదికలో చెప్పింది. ఈ భూముల్లోంచి మురుగునీరు ప్రవహిస్తూ అందులో ఉన్న చెరువుల్లో కలుస్తుందని, ఆ చెరువుల వద్ద పక్షులను కూడా తాము చూసి, ఫొటోలు తీసినట్టు పేర్కొన్నది.