హైదరాబాద్ సిటీబ్యూరో/శంకర్పల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రేణు అగర్వాల్ ఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే సైబరాబాద్ పరిధిలోని శంకర్‌పల్లిలో మరో దోపిడీ కలకలం రేపింది. పట్టపగలే కారులో వెళ్తున్న వ్యక్తులను దుండగులు అటకాయించి కండ్లలో కారం కొట్టి, బొమ్మ తుపాకీతో బెదిరించి దారిదోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ట్రై కమిషనరేట్ల పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రాకేశ్ అగర్వాల్ స్టీల్ వ్యాపారి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు స్టీల్ పాత్రలు, ఇతర సామగ్రి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి రూ.40 లక్షలు వికారాబాద్‌లోని కస్టమర్ నుంచి రావాల్సి ఉన్నది. వచ్చి డబ్బు తీసుకెళ్లాలని కస్టమర్ చెప్పడంతో రాకేశ్ అగర్వాల్ తన సిబ్బంది సాయిబాబా, మణిని కారులో వికారాబాద్ పంపాడు. వాళ్లు కస్టమర్ నుంచి రూ.40 లక్షలు తీసుకొని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్‌పూర్ చేరుకోగానే నలుగురు దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వెంబడిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో అటకాయించారు. కారు నడుపుతున్న మణి కండ్లలో కారం కొట్టి దాడిచేశారు.
కారు అద్దాలు పగులగొట్టి వెనక కూర్చున్న సాయిబాబాను బొమ్మ తుపాకీతో బెదిరించి రాయితో కొట్టి అతడి వద్ద నుంచి రూ.40 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కెళ్లారు. దుండగులు పారిపోతున్న క్రమంలో వారి కారు కొత్తపల్లి శివారులో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారును అక్కడే వదిలి డబ్బుతో దుండగులు పరారయ్యారు. కారు బోల్తాపడ్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్స్ స్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు సీసీఎస్, ఎస్వోటీ విభాగాలతో నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో దుండగులను గుర్తించినట్టు తెలిసింది. స్టీల్ వ్యాపారి సిబ్బంది డబ్బు తీసుకెళ్తున్న విషయం దుండగులకు ఎలా తెలిసింది? వారు ఎక్కడి నుంచి అనుసరిస్తూ వచ్చారు? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారులకు తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.