హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు బడ్జెట్ నుంచి రూ.40కోట్లు విడుదల చేయాలని ప్లానింగ్ శాఖ.. ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అసంపూర్తిగా ఉన్న బ్రాహ్మణ సదన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు వివేకానంద విదేశీ విద్యా పథకం, విద్యార్థుల ఉపకార వేతనాలు, స్వయం ఉపాథి పథకం(బెస్ట్) తదితర స్కీమ్‌ల లబ్ధిదారులకు పెండింగులో ఉన్న నిధులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
దీనిపై స్పందించిన ప్లానింగ్ శాఖ.. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికం బడ్జెట్ నిధుల కింద రూ.40కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇటీవలే ప్రభుత్వం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించడంతోపాటు ఆమెకు చెక్ పవర్‌ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా హరీశ్‌రావు, రమాణాచారి విజ్ఞప్తిపై నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.