హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపక శాఖ మరింత బలోపేతం కానున్నది. ఈ ఏడాది చివరిలోగా రూ.73.41 కోట్లు వెచ్చించి పలు అగ్నిమాపక యంత్రాలను సమకూర్చుకోనున్నది. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్కు రూ.190.14 కోట్ల నిధులు రావల్సి ఉన్నది. ఇందులో తొలి విడతగా విడుదలయ్యే రూ.73.41 కోట్లతో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. బహుళ అంతస్థుల భవనాల్లో ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో 104 మీటర్ల ఎత్తయిన హైడ్రాలిక్ ఫైర్ ఫైటర్‌ను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. పారిశ్రామికవాడల్లో అగ్నిప్రమాదాలు, కెమికల్ బ్లాస్ట్‌లు జరిగినప్పుడు నష్టాన్ని నిరోధించడంలో అగ్నిమాపక సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా రూ.6 కోట్లతో ఫైర్ ఫైటింగ్ రోబోను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. వీటితోపాటు 18 వాటర్ టెండర్లు, 18 మిస్ట్ మినీ వాటర్ టెండర్లు, 18 థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, 18 పోర్టబుల్ పంపులు తదితర యంత్రాలను కొనుగోలు చేయనున్నట్టు వివరించారు. రెండో విడతలో కేంద్రం నుంచి విడుదలయ్యే రూ.66.56 కోట్లతో 68 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలిగే టర్న్ టేబుల్ ల్యాడర్తోపాటు పలు ఇతర పరికరాలను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.