హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందే భారత్ సర్వీసులను అవసరమైన స్టేషన్ల మీదుగా నడుపుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనివైష్ణవ్ లోకసభలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైళ్లను నడుపడం లేదని పేర్కొన్నారు. లోకసభలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా గత నెల 26 వరకు మొత్తం 50 వందేభారత్ సర్వీసులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. వందేభారత్ రైళ్లలో మొత్తంగా 99.60% ఆక్యుపెన్సీ ఉన్నదని, అయితే రైళ్ల వారీగా సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదని పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను నిరంతరంగా అవసరాలకు అనుగుణంగా ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు.