హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడా తేలికపాటు లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో గురువారం వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉదయం ఎండకాసినా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు పేర్కొన్నారు. 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడుతాయని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని వృద్ధుడు (65) వడదెబ్బతో మంగళవారం మృతిచెందినట్టు కాచిగూడ అడ్మిన్ ఎస్సై సుభాశ్ తెలిపారు.