హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిని సబ్సిడీపై రైతులకు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘నమో డ్రోన్ దీదీ’ కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు అందించాలని సూచించారు.
వానకాలం సీజన్‌కి నెలవారీగా కేంద్రం కేటాయించిన ఎరువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా 1,55,257 టన్నుల జొన్నలను సేకరించామని, ఇప్పటికే రూ.302 కోట్లు రైతులకు చెల్లించామని, మిగిలిన బకాయిలను కూడా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ధరల కమిషన్‌కు సంబంధించిన దక్షిణ ప్రాంతీయ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని మారిగోల్డ్ హోటల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
గురువారం నెదర్లాండ్ కంపెనీ ఏఆర్ఐ క్యూటీ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.