హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించే టీజీ ఈసెట్ తుది విడత సీట్లను శనివారం కేటాయించారు. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఇంజినీరింగ్లో 10,129(80.27%), ఫార్మసీలో 57(4.42%) మంది చొప్పున మొత్తం 10,186 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. ఈ సారి ఇంజినీరింగ్లో 2,489, ఫార్మసీలో 1,230 చొప్పున 3,719 సీట్లు భర్తీ కాలేదు. సీట్లు పొందిన వారు ఈ నెల 20లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 22లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్చేయాలి. ఈ సారి ఫార్మసీకి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ఫార్మసీలో 1,287 సీట్లకు, కేవలం 57 సీట్లు మాత్రమే నిండగా, 1,230 సీట్లు నిండలేదు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో 11 సీట్లుంటే ఒక్కటి కూడా నిండకపోవడం గమనార్హం. ఇక 6 వర్సిటీ కాలేజీల్లో 69 సీట్లకు కేవలం 27 సీట్లు, 116 ప్రైవేట్ కాలేజీల్లో 1,287 సీట్లకు 30 సీట్లు మాత్రమే నిండాయి. ఇంజినీరింగ్ బ్రాంచీలవారీగా భర్తీ అయిన సీట్లను పరిశీలిస్తే సీఎస్ఈ తత్సమాన బ్రాంచీల్లో 72.56%, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 98.30%, సివిల్, మెకానికల్ తత్సమాన బ్రాంచీల్లో 93.50%, ఇతర బ్రాంచీల్లో 80.27% చొప్పున సీట్లు నిండాయి.
ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు ; విద్యాసంవత్సరంలో నిలిచిపోనున్న 150 సీట్ల అడ్మిషన్లు
వరంగల్ చౌరస్తా, జూలై 19 : వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాల అనుమతులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. రెండేండ్ల క్రితమే అనుమతులు పొందిన ఈ కళాశాలకు 150 సీట్లను కేటాయించింది. రెండేండ్లుగా వైద్య కళాశాల కొనసాగుతుండగా ఎన్ఎంసీ అనుమతు లు రద్దు చేయడం వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి సౌకర్యాలు లేకున్నప్పటికీ తనిఖీలకు వచ్చిన బృందంతోపాటు అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమ పద్ధతిలో అనుమతులు పొందినట్టు ఎన్ఎంసీ గుర్తించింది. అక్రమ నివేదికలతో అనుమతులు పొందినట్టు దేశవ్యాప్తంగా పలు కళాశాలలపై ఫిర్యాదు లు అందడంతో సీబీఐ కేసు నమోదుచేసింది. విచారణలో భాగంగా ఫాదర్ కొలం బో మెడికల్ కళాశాల రెండు విడతలుగా రూ.70 లక్షలు లంచంగా ఇచ్చి అనుమతులు పొందినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఎన్ఎంసీకి సమాచారం అందించారు. ఈ విషయమై కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సమాచారం అందించినట్టు రిజిస్ట్రార్ తెలిపారు. రాబోయే మెడికల్ కౌన్సెలింగ్లో యూనివర్సిటీ పరిధిలోని 27 కళాశాలల సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.