హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ, విపత్తు నియంత్రణ కోసం బంజారాహిల్స్లో నిర్మించిన అత్యంత అధునాతనమైన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్ఐసీసీసీ) భారతదేశానికే ఒక ఐకాన్ (తలమానికం) అని పలువురు విదేశీయులు ప్రశంసించారు. అడిట్ అఫ్ ఈ-గవర్నెన్స్ అంతర్జాతీయ శిక్షణలో భాగంగా శుక్రవారం 25 దేశాలకు చెందిన 37 మంది ప్రతినిధులు టీఎస్ఐసీసీసీని సందర్శించారు.
సేవలందించేందుకు తీసుకుంటున్న సత్వర చర్యలు అద్భుతమని వారు ప్రశంసించారు. ముందుగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణం, ఇంజినీరింగ్ ప్రత్యేకతలు, టెక్నాలజీ ప్యూజన్ సెంటర్, క్రైసిస్ మేనేజ్మెంట్, సీసీటీవీలు, అనలిటిక్స్ విభాగాల గురించి విదేశీ బృందం తెలుసుకుం ది. అనంతరం ఎస్పీ పుష్ప తెలంగాణ పోలీసు లు ఉపయోగిస్తున్న వివిధ ఐటీ అప్లికేషన్లు, ప్రజలకు సేవలు అందించేందుకు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి వివరించారు. ఆయా అంశాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ పుష్ప వివరించారు. భవనంలోని మ్యూజియం, హెలిప్యాడ్, అడిటోరియం తదితర విభాగాలను సైతం ప్రతినిధుల బృందం సందర్శించింది.