అచ్చంపేట/హైదరాబాద్ జూలై 17 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్ద పులుల సంఖ్య పెరిగినట్టు డీఎఫ్‌వో రోహిత్ గోపిడి వెల్లడించారు. నిరుడు 33 పులులు ఉండగా ఈ సారి వాటి సంఖ్య 36కు చేరినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పులుల లెక్కింపునకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు.
నిరుడు డిసెంబర్ 20నుంచి ఈ ఏడాది మే15 వరకు కెమెరా ట్రాకింగ్ కోసం రిజర్వ్ ఫారెస్టును నాలుగు బ్లాకులుగా విభజించి.. ఒక్కో బ్లాక్‌లో 250 నుంచి 300 కెమెరాలను బిగించినట్టు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా డేటాను సేకరించి పులుల వివరాలను నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 36 పులులు ఉండగా, వాటిలో 13మగ, 20ఆడ పులులు ఉన్నాయని వివరించారు. అలాగే వాటిలో 2 పిల్లలు ఉన్నాయని, ఒకటి మాత్రం సరిగా గుర్తించబడలేదని తెలిపారు. పులుల సంరక్షణ కోసం నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు.