హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బార్లకు దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ గడువు శుక్రవారంతో ముగియడంతో.. వాటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24బార్లకు, మిగిలిన జిల్లాల్లో మరో 4బార్లకు దరఖాస్తులకు స్వీకరణకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో 4 బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈనెల 13న జీహెచ్ఎంసీ పరిధిలోని 24బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్, ఆయా జిల్లాల పరిధిలోని బార్లకు కలెక్టర్లు డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ దశరథ్ వెల్లడించారు.