న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: శత్రువుల ఆస్తులను(ఎనిమీ ప్రాపర్టీస్) విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.3,400 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంగళవారం పేర్కొన్నది. విక్రయించిన ఆస్తుల్లో ఎక్కువగా చరాస్తులు, బంగారం, షేర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంతో పాటు 1962, 1965 యుద్ధాల తర్వాత భారత్‌ను వీడి పాకిస్థాన్, చైనా పౌరసత్వం తీసుకొన్న వారు మన దేశంలో వదిలివెళ్లిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీస్‌గా పేర్కొంటారు. దేశంలో మొత్తంగా 12,611 ఎనిమీ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో 12,485 పాక్ పౌరసత్వం తీసుకొన్న వారికి కాగా, 126 చైనా పౌరులుగా మారిన వారికి చెందినవని అధికారి ఒకరు తెలిపారు.