సిరిసిల్ల టౌన్, జూన్ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్‌నగర్ కాలనీ, అంకుసాపూర్‌లో మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంగళవారం రాత్రి కేసీఆర్ నగర్లో తిన్న 19 మందితోపాటు బుధవారం సాయంత్రం అంకుసాపూర్‌లో తిన్న 12 మంది దవాఖాన పాలయ్యారు.
వీరిలో 15 మంది చిన్నారులు, 16 పెద్దలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ సిరిసిల్ల దవాఖానకు వెళ్లి బాధితులను పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స కోసం సహకారం అందిస్తామని, మనోధైర్యంతో ఉండాలని కేటీఆర్ వారికి భరోసా కల్పించారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు పానీపూరి విక్రేత ఇంట్లో తనిఖీ చేశారు. వ్యాపారి మోహన్‌లాల్ ప్రజాపతిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.