హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి పడే ప్రసవ వేదన ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటివరకు పడిన బాధను ఆ తల్లి మర్చిపోయి తన పసిగుడ్డును గుండెలకు హత్తుకుని మాతృత్వపు అనుభూతితో మురిసిపోతుంది. అయితే, కొన్ని ప్రైవేటు దవాఖానలు లాభాపేక్షతో వారిని ఆ మాధుర్యానికి దూరం చేస్తున్నాయి. ఇందుకు సిజేరియన్ ప్రసవాలే కారణం. 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మొత్తం 5,36,816 ప్రసవాలు కాగా.. అందులో 3,05,944 మంది సిజేరియన్ ద్వారానే బిడ్డలను కన్నారు.
కొన్ని ప్రైవేటు దవాఖానలు కాసుల వేటలో ఎడాపెడా సిజేరియన్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సిజేరియన్లు చేయించుకున్న వారిలో చాలామంది గర్భసంచి సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారు. దీంతో గర్భసంచి తొలగింపు కేసులూ పెరుగుతున్నాయి. సహజంగా ప్రసవించే అవకాశం ఉన్నా ప్రైవేటు దవాఖానలు డబ్బుల కోసం సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాల్సి ఉన్నా తల్లి కడుపులో బిడ్డ ఆరు నెలలు ఉన్నప్పుడే సిజేరియన్ కోసం ప్యాకేజీలు మాట్లాడుకొనే దవాఖానలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సిజేరియన్లు 10-15 శాతం దాటొద్దని చెబుతున్నా.. ప్రైవేటు దవాఖానలు గర్భిణులకు కడుపులో కోత పెట్టి అడ్డగోలుగా జేబులు కొల్లగొడుతున్నాయి.
రాష్ట్రంలో 58 శాతం సిజేరియన్ ప్రసవాలే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సాధారణ ప్రసవాలకు తక్కువ ఫీజును వసూలు చేయడంతోపాటు తల్లీ, బిడ్డలను వెంటనే డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది. అలా అయితే తమ జేబులు నిండవని భావిస్తున్న ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు అవసరమున్నా లేకున్నా సీజెరియన్ ఆపరేషన్లు చేసి వారిని నాలుగైదు రోజులు అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇలా ఎత్తులు వేసి వారి నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ప్రైవేటు దవాఖానల్లో గత మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే సహజ ప్రసవాలకు, సిజేరియన్లకు మధ్య భారీ తేడా కనిపిస్తున్నది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వరుసగా ప్రైవేటు దవాఖానల్లో 2809, 4039, 3525 నార్మల్ డెలివరీలు కాగా.. ఇదే నెలల్లో 7491, 11449, 9427 సిజేరియన్లు కావడం విస్తుపోయేలా చేస్తున్నది. ఈ గణాంకాలు ప్రైవేటు దవాఖానల దోపిడీకి అద్దం పడుతున్నది. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ల కన్నా.. నార్మల్ డెలివరీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.