హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాల్‌కు రూ.300 సబ్సిడీపై శనగ విత్తనాలను సరఫరా చేయనున్నట్టు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ హాకాభవన్లోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ ఎండీ ఉదయ్‌కుమార్‌తో కలిసి సబ్సిడీ వివరాలను వెల్లడించారు.
ఈ యాసంగి సీజన్లో రైతులకు కావాల్సిన శనగ జేజీ 11, జాకీ రకాల విత్తనాలను 20 వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. క్వింటాల్ ధర రూ.తొమ్మిది వేలు ఉండగా, రూ.300 రాయితీ వస్తుందని, రైతులు రూ.8,700 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. యాసంగి వరి విత్తన రకాలు కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ 27356, ఎంటీయూ 1010, కేఎన్ఎం 118, జేజీఎల్ 24423ను రైతులకు అందుబాటులో ఉంచేలా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు.