RRR | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సహజంగా రెండు ప్రధాన రోడ్ల మధ్య అనుసంధానం కోసం డబుల్ లేన్ రోడ్డు.. మరీ కావాలంటే నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌రింగ్ రోడ్డు, రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు అనుసంధానంగా ఏకంగా 300 అడుగుల రేడియల్ రోడ్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే ఇది ఇంచుమించు ఔటర్ రింగురోడ్డు అంత వెడల్పు ఉంటుంది. అంతేకాదు, ఇది మొత్తం గ్రీన్‌ఫీల్డ్ (పొలాల మధ్య నుంచి ఏర్పాటుచేసే రోడ్డు) రోడ్డు కావటం గమనార్హం. ఎటువంటి ట్రాఫిక్ అధ్యయనం లేకుండా ఎవరికోసం ఇంత భారీ రోడ్డును ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అంతుబట్టడం లేదు. దీని వెనుక భారీ రియల్ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ రహదారుల శాఖతో సంబంధం లేకుండా ఆర్ఆర్ఆర్-దక్షిణ భాగం రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని దాదాపు నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఓ వైపు దక్షిణ భాగం అలైన్మెంట్ అష్టవంకరలు తిరుగుతూ ఇంకా తుది దశకు కూడా చేరుకోని పరిస్థితి ఉండగా, మరోవైపు రేడియల్ రోడ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఓఆర్ఆర్కు, ఆర్ఆర్ఆర్కు మధ్య 9 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం-13 నుంచి ఏర్పాటు చేయనున్న రేడియల్ రోడ్డును ఏకంగా 300 అడుగుల వెడల్పుతో నిర్మించాలని నిర్ణయించటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై వివిధ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి.
రెండు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ రేడియల్ రోడ్డు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ మీదుగా స్కిల్ యూనివర్సిటీ వరకు సాగుతుంది. ఈ మేరకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 41.5 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 13 (రావిర్యాల) నుంచి రంగారెడ్డి జిల్లా, ఆమన్‌గల్ మండలంలోని ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రతిపాదిత 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్లలో ఇదీ ఒకటి. మొదటి దశలో కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వరకు 18 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనుండగా, మిగిలింది రెండో దశలో నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 6 మండలాల్లోని 15 గ్రామాల పరిధిలో 916 ఎకరాల భూములు సేకరించాల్సిన అవసరం ఏర్పడుతుందని గుర్తించారు.
మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్ద్, కందుకూరు మండలంలోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మదవెల్లె, పంజాగూడ, మీర్ఖాన్పేట్, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముడ్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లె, యాచారం మండలంలోని కుర్మిద్ద, ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్ తదితర గ్రామాల పరిధిలో మొత్తం 916 ఎకరాల భూములు సేకరించాలని ప్రణాళికలు రూపొందించగా, ఇందులో 568 ఎకరాలు ప్రైవేటు భూములుగా గుర్తించారు. మిగిలిన భూముల్లో 156 ఎకరాలు టీజీఐఐసీ, 169 ఎకరాలు రిజర్వు ఫారెస్టు, 23 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్పెషల్ టౌన్‌ప్లానింగ్ స్కీమ్ కింద ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని.. ఇందులో 60 శాతం భూయజమానులకు, 40 శాతం హెచ్ఎండీఏకు భాగం ఉండేలా ప్రతిపాదించారు.
ఎక్కడైనా రోడ్డు నిర్మించాలంటే సమగ్రంగా ట్రాఫిక్ అధ్యయనం చేస్తారు. అయితే, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ఇదెక్కడా కానరావటం లేదు. ఇటీవల సీఎం నివాసంలో ఆర్ఆర్ఆర్ ప్రాజక్టుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎక్కడెక్కడ రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయాలి? ఆర్ఆర్ఆర్ ఎటువైపు నుంచి వెళ్లాలి? అనే విషయాలు పూర్తిగా ముఖ్యమంత్రే అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 300 అడుగుల వెడల్పు రేడియల్ రోడ్డు విషయంలోనూ సీఎం చెప్పినట్టే ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అసలు అంత వెడల్పు రోడ్డు అవసరమా? లేదా? అనేది అధికారులకూ అంతుబట్టడం లేదు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగివున్నాయో? ఈ రోడ్డు వల్ల బలయ్యే రైతులు ఎవరో? రానున్న కాలమే నిర్ణయించాలి.