Telangana | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తియ్యటి మాటలు చెప్పారు.. 420 హామీలు ఇచ్చారు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్నారు.. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కానీ, పాలనాపగ్గాలు చేపట్టి 300 రోజులైనా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఆటోడ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కులవృత్తులు.. ఇలా సబ్బండవర్ణాల ప్రజల ఓట్లను దృష్టిలో పెట్టుకొని 420 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. వాటిని చూసి ప్రజలు ఆ పార్టీకి ఓట్లేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్టోబర్ ఒకటో తేదీనాటికి 300 రోజులైనా హామీలు అమలు కావడం లేదు. పాత ఆర్టీసీ బస్సుల్లో కష్టాల మధ్య మహిళల ఉచిత ప్రయాణం ఒక్కటే అమలవుతున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మూడు మినహా మిగతా హామీలన్నీ అటకెక్కాయి. నిరుపేద మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ హామీలపై రేవంత్రెడ్డి సర్కారు కనీసం నోరు మెదపడం లేదు. వానకాలం సీజన్ అయిపోయినా రైతుభరోసా ఇవ్వలేదు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ నేటికీ సగం మంది రైతులకు దక్కనేలేదు. పింఛన్లు రూ.రెండువేల నుంచి నాలుగవేలకు, రూ.నాలుగువేల నుంచి ఆరు వేలకు పెంచుడు మాటలకు పరిమితమైంది. మహిళలకు నెలకు రూ.2,500 అందని ద్రాక్షగానే మిగిలింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ మాట నీటిమూటలా మారింది.
మొత్తం 42 పేజీలతో 420 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ వర్గాలను ఆకట్టుకొనేలా హామీలను ప్రకటించింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాటిచ్చింది. కానీ, 300 రోజులు అయినా 420 హామీలో కనీసం పది పథకాలు కూడా పట్టాలెక్కలేదు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిందని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కుటుంబంలో ఒక్కరికే పింఛన్ అందితే, కుటుంబంలో అర్హులైన ఇద్దరికి పింఛన్ ఇవ్వడంతోపాటు రూ.2 వేలను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా పింఛన్లు రాకపోగా పాతవి కూడా సక్రమంగా అందటం లేదని వృద్ధులు, వితంతువులు వాపోతున్నారు. వానకాలం సీజన్ ముగిసిపోతున్నా కేసీఆర్ ఇచ్చిన రూ.10,000 రైతుబంధు నేటికీ అందలేదు. రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000పై కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోరు మెదపడం లేదు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇచ్చే హామీపై విధివిధానాలైనా రూపొందించారా? అంటే అదీ లేదు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి దెబ్బతిన్నదని, ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందిస్తామన్న హామీ ఇంకెప్పుడు అమలుచేస్తారని ఆటోడ్రైవర్లు నిలదీస్తున్నారు.