హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పోర్చుగీసు పాలన నుంచి విముక్తి పొందిన గోవా విమోచన ఉత్సవాలకు రూ.300 కోట్లు ఇచ్చిన మోదీ సర్కారు.. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు 3 పైసలు కూడా ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) చైర్మన్ మన్నె క్రిశాంక్ శుక్రవారం ట్విట్టర్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు తెలంగాణ చరిత్రను వక్రీకరించేలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ అమరవీరులను, పోరాటయోధులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు పోటీగా కేంద్రం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
పోటీపడి హైదరాబాద్కు వచ్చే కేంద్ర మంత్రులను రాష్ట్ర బీజేపీ నేతలు ఒప్పించి వజ్రోత్సవాలకు నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గోవా మాదిరి తెలంగాణ ఉత్సవాలకూ కేంద్రం సాయం చేయాలని, శనివారం హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ట్విట్టర్లో ఆయన కోరారు.