Accident | వరంగల్ : వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం రహదారిపై బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ నుంచి తొర్రూర్ వైపు వెళ్తున్న బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.