హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో 2018-19 విద్యా సంవత్సరానికి చెందిన ఫెయిలైన బీటెక్(ఇంజినీరింగ్) విద్యార్థులకు ఆ యూనివర్సిటీ అధికారులు శుభవార్త చెప్పారు. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలలో తక్కువ మార్కులతో ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం కల్పించారు. ఇందుకు వారికి 30 గ్రేస్ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకొన్నారు. దీనివల్ల 2018-22 బ్యాచ్లో ఫెయిలైన దాదాపు 2,500 నుంచి 3,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. అయితే, త్వరలోనే దీనిపై మరింత స్పష్టత రానున్నదని వర్సిటీ రిజిస్ట్రార్ మంజూరుహుస్సేన్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే అన్ని రకాల యూనివర్సిటీ కాలేజీలు, అఫిలియేషన్ కాలేజీ యాజమాన్యాలకు యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థుల దరఖాస్తులకు త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.