హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. కరెంటు తీసేసి ప్రతి ఇంటిని జల్లడపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. ఫొటోలను డిలీట్ చేయించి.. అక్కడిని పంపించారు. దుద్యాల, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పోలీసుల జులుంపై తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌పై శాపనార్ధాలు పెట్టారు. ఇందుకోసమేనా నిన్ని ముఖ్యమంత్రిని చేసిందని విమర్శించారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కాగా, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల బృందం నేడు లగచర్యలలో పర్యటించనుంది.
కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్రజేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమికొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్, పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీసి సొమ్మసిల్లిపోయారు. ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది.
ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నా రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ‘అభివృద్ధి వద్దు.. ఏమీ వద్దు! మా మానాన మమ్మల్ని వదిలేయండి! ఫార్మా కంపెనీలకు భూమిలిచ్చే ప్రసక్తే లేదు.. భూముల కోసం ఎంతకైనా తెగిస్తాం’ అం టూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెబుతున్నా సర్కారు మొండిపట్టు వీడలేదు. ప్రజాభిప్రాయ సేకరణ.. గ్రామసభ.. అంటూ రైతుల భూముల సేకరణకు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు. ఏకంగా కలెక్టర్ సహా అధికారయంత్రాంగంపై దాడి చేసే పరిస్థితి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముందుగా రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్పై దాడికి ప్రయత్నించి.. వారి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. వెంకట్‌రెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీశారు. ఈ ఘటనతో లగచర్ల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.