ఖమ్మం/రఘునాథపాలెం, జూన్ 17: ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి సీఎం కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
అర్హులైన నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం మంత్రి రఘునాథపాలెం, శివాయిగూడెం, మంచుకొండ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 66 మందికి మంజూరైన రూ.29.43 లక్షల విలువైన సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను ఖమ్మంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తన సిఫారసుల మేరకు ఇప్పటివరకు 2,901 మంది లబ్ధిదారులకు రూ.12.04 కోట్ల ఆర్థిక సాయం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైందని మంత్రి పేర్కొన్నారు.