
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మద్యం మత్తు, అతివేగం ముగ్గురి ప్రా ణాలను బలి తీసుకున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాయిసిద్ధు గచ్చిబౌలి హౌజింగ్ బోర్డులో స్నేహితుడు ప్రసాద్‌తో కలిసి ఉంటున్నాడు. లఘుచిత్రాలు రూపొందిస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అదేరంగంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఎం మానస (21)తో పరిచయం ఏర్పడింది. కర్నాటకకు చెందిన ఎన్ మానస (23) ఇన్‌స్టాలో కలిసింది. శుక్రవారం రాత్రి సాయిసిద్ధు ఇంట్లో వీరంతా దావత్ చేసుకొన్నారు. పార్టీకి సాయిసిద్ధు తన స్నేహితుడు మాదాపూర్ యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తున్న విజయవాడకు చెందిన అబ్దుల్ రహీం (25)ను ఆహ్వానించాడు. రాత్రి 1.30 ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో లింగంపల్లికి బయలుదేరారు. అబ్దుల్ రహీం కారు నడుపుతున్నాడు. 2 గంటల సమయంలో గచ్చిబౌలి -లింగంపల్లి మార్గంలో ఎస్బీఐ శిక్షణా కేంద్రం సమీపంలో రోడ్డుకు పక్కన చెట్టును బలంగా ఢీకొట్టారు. అబ్దుల్ రహీం, ఎం మానస, ఎన్ మానస అక్కడికక్కడే మృతిచెందారు. సాయిసిద్ధు తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగమే ప్రమాదానికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.