మణుగూరు రూరల్, ఆగస్టు 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని ఓసీ-2లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. బొలెరో వాహనాన్ని డంపర్ ఢీకొట్టగా ఇద్దరు కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఓసీ-2 ఉపరితల గనిలో మధ్యాహ్న భోజనం అనంతరం అజ్మీర భాష్యా (49)- ఎలక్ట్రీషియన్, పర్స సాగర్ (25) -జనరల్ మజ్దూర్, కాంట్రాక్ట్ డ్రైవర్ వేల్పుల వెంకన్న (32) క్వారీలోకి వెళ్లేందుకు బొలెరో వాహనంలో బయల్దేరారు. ఓసీ సెక్షన్-2లో గొర్రెపేట వాగు బ్లాక్లో బొలెరోపైకి 100 టన్నుల డంపర్ దూసుకెళ్లింది. డంపర్ ఆపరేట్ చేస్తున్న రకీబ్ గని నుంచి క్వారీలోకి వెళ్లేందుకు రోడ్డు మారుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.