హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రైజింగ్ తెలంగాణ.. 5.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు.. మూడు లక్షల కోట్ల బడ్జెట్.. అంటూ ప్రభుత్వం అంకెల గారడీతో గొప్పలు చెప్పడం ఒక కోణమైతే.. మరోవైపు టాయిలెట్లు లేని పాఠశాలలు రాష్ట్రంలో దర్శనమిస్తుండటం మరో కోణం. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో టాయిలెట్లు అస్సలు లేని బడులు 2,763 ఉన్నాయంటే నమ్మశక్యంగా లేకున్నప్పటికీ ఇది వాస్తవం. వీటిలో 2వేలకు పైగా బాలుర, 700కు పైగా బాలికల స్కూళ్లు ఉండటం గమనార్హం. నిబంధనల మేరకు ప్రతి 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలి. ముఖ్యంగా బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలి. కానీ, బాలికలకు అసలు టాయిలెట్లు లేని పాఠశాలలు ఉండటం గమనార్హం. టాయిలెట్లు లేకపోవడం, వసతుల లేమి కారణంగా రాష్ట్రంలో చిన్నారులు సర్కారు బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య పెరుగుతున్నదని ఆరోపిస్తున్నాయి.
52 స్కూళ్లలో నీటివసతి కరువు..
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో టాయిలెట్లే కాదు, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువయ్యాయి. తాగునీటి వసతి లేని బడులు 52 ఉన్నాయి. ఈ బడుల్లోని చిన్నారులు ఇంటి నుంచి వాటర్బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. టాయిలెట్లు లేని కారణంగా బాలికలు మంచినీళ్లు కూడా తాగడం మానేస్తున్నారు. దీంతో అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవానికి పగటిపూట ఇంటితో పోల్చితే విద్యార్థులు అధిక సమయం బడుల్లోనే గడుపుతారు. రోజులో దాదాపు 6-8 గంటలు స్కూళ్లలోనే ఉంటారు. ఈ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వసతులు లేక అవస్థలు పడుతున్నారు.
ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితి..