Free Bus for Women | సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే.. ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతున్నది. ఈ పథకం అమలుతో ఒక్క సారిగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగడంతో పాటు బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే బస్సు సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో డ్రైవర్లు, కండక్టర్లు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఇప్పుడున్న బస్సులకు రెండింతలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కానీ అందుకు తగిన నిధుల కొరత ఆర్టీసీని పట్టి పీడిస్తున్నది. అయితే రూ.400 కోట్లు వెచ్చించి 1050 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని యాజమాన్యం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే అందుకు సంబంధించిన నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుందన్న అంశంపై మాత్రం యాజమాన్యం క్లారిటీ ఇవ్వడం లేదు. ముందస్తు ప్రణాళికలు లేకుండా.. ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టి ఉండాల్సింది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సులన్నీ 2010 కంటే ముందు కొనుగోలు చేసినవే. వీటికి 15 ఏండ్లు దాటడంతో కాలం చెల్లినవిగా రవాణా శాఖ పరిగణిస్తున్నది. నగరంలో మొత్తం 2700 పాత బస్సులకు కొత్త బాడీ తగిలించి, కొత్త బస్సులుగా రోడ్లపై తిప్పే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. అయితే పాత బస్సులన్నింటిని తక్షణమే స్క్రాప్‌గా గుర్తించి, వాటికి బదులుగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆర్టీసీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అద్దె బస్సులపైనే ఆధార పడుతుంది.
కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాదిలో 540 విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. కానీ ఈ విషయంలో ఆర్టీసీ తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఈవీ బస్సులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కనీసం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనైనా ఈవీ బస్సులు వస్తాయని ఆర్టీసీ భరోసా ఇవ్వడంలేదు.
ప్రస్తుతం మహలక్ష్మి పథకం అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నప్పటికీ కొత్త బస్సులకు బదులుగా అద్దె బస్సులపై దృష్టి సారించింది. అందుకోసం నగర అవసరాల కోసం 340 అద్దె బస్సుల కోసం టెండర్లు దాఖలు చేసినప్పటికీ స్పందన పెద్దగా కనిపించడం లేదు. ఈ పథకం వల్ల అద్దె బస్సుల యజమానులు కూడా తీవ్ర అంతృప్తిగానే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన నగరంలో నడుస్తున్న దాదాపు 280పైగా అద్దె బస్సుల గడువు మించిపోతుంది. ఈ గడువు ముగిసే లోగా కొత్త టెండర్లు ముగించి, అద్దె బస్సుల కోసం ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ కొంత వరకు గందరగోళ పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉచిత బస్సు ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఆర్టీసీకి సహకరిస్తామని ప్రైవేటు బస్సుల యాజమాన్య సంక్షేమ సంఘం ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే జనవరి 5 నుంచి అద్దె బస్సులు తిప్పకుండా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం ఉచిత బస్సుల పథకం సజావుగా సాగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.