రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకు కుదించింది. ఇదీ బీజేపీ చిత్తశుద్ధి!
– ఎమ్మెల్సీ పల్లా
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మోదీ అసమర్థ పాలనలో దేశంలో ప్రతిరోజూ 270 కంపెనీలు మూతపడుతున్నాయని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ లెక్కలు తప్పయితే తాను ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని వెల్లడించారు. కేంద్రంలో 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. తెలంగాణ సర్కారు తొమ్మిదేండ్లలోనే 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని పేర్కొన్నారు. మరో 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ్యలని మండిపడ్డారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్‌లో పర్యటించిన మోదీ.. విమర్శలకే పరిమితమయ్యారని, వరంగల్ ప్రజలకు నిరాశ కలిగించారని మండిపడ్డారు. బీజేపీ స్థానిక నేతలు రాసిచ్చిన స్రిప్టును మోదీ చదివారని, ఎక్కు వ చదువుకోని ప్రధాని ఉంటే ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టానికి ప్రైవేటు కంపెనీలను ఆకర్షించడం ద్వారా ఇప్పటివరకూ 23 వేల కంపెనీలు, సంస్థలు రూ.2.65 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని, దీంతో 17.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణలో 9 లక్షలకుపైగా ఉద్యోగాలు చేస్తున్నారని, తెలంగాణ వచ్చే నాటికి ఈ సంఖ్య మూడు లక్షలు కూడా లేదని తెలిపారు. కొన్నేండ్లుగా రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. వాటిలో ఒక్కదానినైనా నిరూపించారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదనే ప్రజలు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.
Palla Rajeshwar Reddy
తెలంగాణకు 2 లక్షల కోట్లు రావాలి
కేంద్రానికి తెలంగాణ వివిధ ట్యాక్సుల రూపంలో 3.60 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం తెలంగాణకు కేవలం 1.60 లక్షల కోట్లే ఇచ్చిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కేంద్రమే తెలంగాణకు ఇంకా 2 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. కేంద్రం చేసిన అప్పు ఎం త, రాష్ట్రం చేసిన అప్పు ఎంత అనేది బీజేపీ నాయకులే చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధుతో 70 వేల కోట్లకు పైగా రైతుల ఖాతా ల్లో జమచేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 3 కోట్లకు పరిమితం చేశారని విమర్శించారు.
వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే ముందున్నదని చెప్పా రు. యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ అనుబంధ విభాగాలు కోర్టుకు ఎక్కడం వల్ల జారీచేసిన నోటిఫికేషన్ రద్దయిందని, తాజాగా రిక్రూట్మెంట్ కోసం తీసుకువచ్చిన చట్టంపై గవర్నర్ సంతకం చే యడం లేదని పేర్కొన్నారు. వరంగల్ వచ్చిన మోదీ విమానం దిగిన మామూనురులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ ప్రజలు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా.. కేంద్రం స్పందించడంలేదని ఎమ్మెల్యే మెతుకు ఆనం ద్ మండిపడ్డారు. ఎన్నో దేవాలయాలకు నిధులు ఇచ్చే మోదీ భద్రకాళి ఆలయానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు.