హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నల్సార్ న్యాయ వర్సిటీ లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కరుణానిధి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావును కలిసి వినతిపత్రం అందజేసింది. వర్సిటీలో 27శాతం రిజర్వేషన్లను తగ్గించి అమలు చేయడంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. చైర్మన్‌ను కలిసిన వారిలో బీసీ ఉద్యోగ సంఘాల నేతలు జీ కరుణానిధి, వీ చెన్నయ్య, వీ దానకర్ణచారి, రవికుమార్, వంశీకృష్ణ, ఏ ప్రదీప్ కుమార్, పీ రవీందర్ తదితరులున్నారు.