Universal Srushti Fertility | హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సృష్టి సరోగసీ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్టు నార్త్‌జోన్ డీసీపీ రశ్మి పెరుమాళ్ చెప్పారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని వివరించారు. డాక్టర్ నమ్రతపై అక్రమ సరోగసీ, చైల్ట్ ట్రాఫికింగ్ కింద 8 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో చాలామంది వైద్యుల ప్రమేయం ఉన్నదని, తన బ్యాచ్మేట్లలో కొందరి సహకారంతో నమత్ర ఈ దందాకు పాల్పడినట్టు గుర్తించామని డీసీపీ పేర్కొన్నారు. వారి పాత్రపైనా లోతైన దర్యాప్తు జరుగుతున్నట్టు డీసీపీ రశ్మి పెరుమాళ్ పేర్కొన్నారు.
సృష్టి కేసులో సరోగసీ, చైల్డ్ట్రాఫికింగ్కు సంబంధించిన వ్యవహారంలో ఏజెంట్లుగా, సబ్ఏజెంట్లుగా చేసిన వారు ఎక్కువ మంది మహిళలేని డీసీపీ తెలిపారు. చాలామంది అండాలు అమ్ముకున్న వారు కూడా ఉన్నారని చెప్పారు. ఈ కేసులో విశాఖపట్నంలోని డాక్టర్ విద్యుల్లత, డాక్టర్ పులుమూరు ఉషాదేవి, డాక్టర్ వాసుపల్లి రవిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ రశ్మి పెరుమాళ్ పేర్కొన్నారు. ఈ కేసులో ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా, మరికొందరిని సబ్ ఏజెంట్లుగా పెట్టుకుని నెట్‌వర్క్‌ను విస్తరించినట్టు చెప్పారు. సరోగేట్‌గా, అండదానం ఇచ్చేవారిగా కొందరు మహిళలు నటించారని, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మా వర్కర్లు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పారు. మగబిడ్డకు రూ.4.5 లక్షలు, ఆడబిడ్డకు రూ.3 లక్షల ధర నిర్ణయించారని రశ్మి పెరుమాళ్ తెలిపారు.
సృష్టి సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై గతంలో గోపాలపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులలో 15 క్రిమినల్ కేసులు నమోదైనట్టు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామని, ఇతర ఆర్థిక వ్యవహారాలపై దృష్టిపెట్టామని చెప్పారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్‌హెడ్స్‌తో నమ్రత అక్రమాలు చేశారని, ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నమ్రత కుమారుడు జయకృష్ణపై బార్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కేసు తీవ్రత నేపథ్యంలో సీసీఎస్ సిట్‌కు అప్పగించినట్టు చెప్పారు. సమావేశంలో గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, గోపాలపురం డీఐ బీవీ కౌశిక్, ఎస్‌హెచ్‌వో మధుకుమార్, బోయిన్పల్లి డీఐ సర్దార్‌నాయక్, మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌వో వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు