జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బుధవారం డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికను ప్రకటించారు. అందులో పేర్లు రానివారు ఆందోళనకు గురయ్యారు. పేర్లు తారుమారు చేశారని, అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ బాధితులు స్థానిక ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
భూపాలపల్లిలో పండ్ల బండితో జీవనం సాగిస్తున్న సమ్మక్క చివరి వరకు తనకు ఇల్లు కావాలని చెప్పులరిగేలా తిరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె పేరును అర్హుల జాబితాలో చేర్చింది. అనంతరం ఆమె పేరు మాయం కావడంతో వంటా వార్పు కార్యక్రమాల్లో పాల్గొంది. తనకు ఇల్లు ఇవ్వాలని వేడుకున్నది. అయినా అధికారపార్టీ కనికరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సమ్మక్క గుండెపోటుతో చనిపోయింది. ఆమె దహన సంస్కారాలు చేయడానికి అద్దె ఇంటి వాళ్లు ఒప్పుకోకపోవడంతో కూతురు ఇంటి వద్ద అంత్యక్రియలు పూర్తిచేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 416 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఎన్నికలు సమీపించేలోగా అర్హుల జాబితాను తయారు చేసి పది మందికి ఇండ్లను కేటాయించింది. అనంతరం ఎన్నికలు జరుగగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ వాయిదా పడింది. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితా తయారు చేసి మంత్రులతో పది మందికి ఇండ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నది. మొదటి విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు రాకపోయే సరికి బాధితులు ఆందోళనకు దిగారు. అక్కడే వంటా వార్పు చేశారు. ఇదిలావుండగా ప్రస్తుతం ఎంపిక చేసిన మొదటి, రెండో విడత జాబితాలో తమ పేర్లున్నా ఇప్పుడు తయారు చేసిన జాబితాలో తమ పేర్లు లేవని, అనర్హులకు ఇండ్లు ఇచ్చారంటూ బాధితులు రోడ్డెక్కారు.
బీఆర్ఎస్ హయాంలో ఎంపిక చేసిన జాబితాలో మా అమ్మ సమ్మక్క పేరు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు మా పేరు లేకుండా చేశారు. మా అమ్మ గొడవ చేసింది. ఇక నాకు ఇల్లు రాదని బాధపడుతూ అనారోగ్యంతో చనిపోయింది. అమ్మ అంత్యక్రియలకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు జాబితాలో ఇల్లు పెట్టాం అని చెప్పారు. ఎమ్మెల్యే కూడా చెప్పారు. ఇప్పుడు పేరు లేదు. ఏం చేయాలో తోచట్లేదు. అనర్హులకు ఇండ్లు ఇచ్చారు. నేను వారి పేర్లు చూపిస్తా.
– తాటికొండ అరవింద్ (సమ్మక్క కుమారుడు)