హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అడవులు తరగడమే తప్ప పెరగడం తెలియని దేశంలో పచ్చదనాన్ని పెంచి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. హరితహారం కార్యక్రమం కింద దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకొంటున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకు ఎక్కింది. పచ్చదనం పెంపుదలకు చేసిన కృషిలో చైనా, బ్రెజిల్ సరసన సగర్వంగా నిలిచింది తెలంగాణ.
మొక్కలను నాటి, సంరక్షించి, అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా రూపుదిద్దుకొన్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం అద్భుత విజయాలు సాధిస్తున్నది. రాష్ట్ర కీర్తిని సమోన్నతంగా నిలబెడుతున్నది. ఈ పథకం కింద రూ.8,511 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం 243 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన మొక్కవోని దీక్ష కారణంగా 9.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవుల పునరుద్ధరణ సాధ్యమైంది.
నగరాలు, పట్టణాల్లో 109 అర్బన్ ఫారెస్టులు అభివృద్ధి చెందాయి. తెలంగాణలో గత నాలుగేండ్లలో పచ్చదనం 7.7 శాతం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం ఈ కార్యక్రమం ప్రాధాన్యతను చాటి చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పద్ధతిలో, అన్ని వర్గాల భాగస్వామ్యంతో గ్రీన్బడ్జెట్ను నిర్వహిస్తున్నది. పట్టణ, నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థల్లోనూ ప్రత్యేకంగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ను కేటాయిస్తున్నది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలతో పాటు ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటేందుకు నర్సరీలను ఏర్పాటు చేసి తెలంగాణ సర్కారు తన నిబద్ధతను చాటుకొన్నది. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నది.
ప్రతి సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మొక్కలు నాటడం ఒక సంప్రదాయంగా మారింది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే స్వీకరిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చడం వల్ల, అవి మొక్కల సంరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి. హరితహారం పుణ్యాన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అడవులు పునర్జీవనం పొందుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కూడాఉద్యమంలా కొనసాగుతూ పచ్చదనం పెంపుదలకు దోహదం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సెలబ్రెటీలను భాగస్వాములను చేయడం ఎందరికో స్ఫూర్తినిస్తున్నది.