Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశతోపాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. 5 కారిడార్లలో మొత్తం 76.4 కి.మీ. పొడవున చేపట్టే మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.4,230 కోట్లు సమకూర్చనుండగా.. జైకా, ఏబీడీ, ఎన్డీబీ లాంటి ఆర్థిక సంస్థల నుంచి రూ.11,693 కోట్ల రుణాలు తీసుకోనున్నారు. మిగిలిన రూ.1,033 కోట్లను పీపీపీ విధానంలో వెచ్చించాలని నిర్ణయించారు. దీనికి ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆర్థిక శాఖ ఆమోదం సైతం లభించడంతో తాజాగా ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో 196ను జారీ చేసింది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో రూ.22 వేల కోట్లతో 3 కారిడార్లలో 69 కి.మీ. మార్గాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించిన ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని (కారిడార్-9) నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రతిపాదనలను రూపొందించింది. దీనిలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా కొంగరకలాన్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ. మార్గం నిర్మాణానికి కూడా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ కారిడార్‌కు సంబంధించిన అలైన్మెంట్, ఇతర ఫీచర్లు, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై మెట్రో అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నది.