హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ అధికారులు రూ.5 లక్షల విలువచేసే 24.282 కిలోల గంజాయి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే పవన్‌కుమార్ నేతృత్వంలోని ఎక్సైజ్ బృందం సోమవారం రాత్రి నాగారం గ్రామ సమీపంలో రూట్‌వాచ్ నిర్వహించిందని తెలిపారు. ఈ సోదాల్లో యాక్టివాపై 1.7 కిలోల పొడి గంజాయి తరలిస్తున్న మంతెన జీవన్, సల్మాన్‌లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారని చెప్పారు. వారిచ్చిన సమాచారంతో తెల్లాపూర్‌లో కవాలి ఆసిఫ్ అలీ ఇంటి నుంచి మరో 22.582 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.5 లక్షల విలువ చేసే 24.282 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, నిందితులను ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందికి అప్పగించామని చెప్పారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు పీ శ్రీధర్, కల్పన, సబ్ఇన్స్పెక్టర్లు విష్ణుగైడ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.