వినాయక్‌నగర్, నవంబర్ 1 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండి ఎత్తుకెళ్లారు. స్థానిక న్యూ ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉండే సముద్రాల ఎల్లేశ్వరరావు దీపావళి పండుగను పురస్కరించుకొని గత నెల 28న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం, బీరువాలోని వస్తువులన్నీ చిందవందరగా పడిఉండటంతో చోరీ జరిగినట్టు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రాజావెంకటరెడ్డి, నగర సీఐ, త్రీటౌన్ ఎస్సై పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్‌ను రప్పించారు. బీరువాలో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలతోపాటు సుమారు 8 తులాల వెండి చోరీకి గురైనట్టు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేశ్ తెలిపారు.
కాగజ్‌నగర్, నవంబర్ 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు రూరల్ ఎస్సై మహేందర్ తెలిపారు. ఎవరులేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువా పగులగొట్టి విలువైన పత్రాలు దొంగిలించారు. సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి నక్క మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. కాగా ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలోనూ చోరీ జరిగిన విషయం తెలిసిందే.