హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయ శాఖలో 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి 111 పోస్టులు కాగా, పదోన్నతుల ద్వారా 93 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. శాఖలో కొంతకాలంగా ఉద్యోగ విరమణ వల్ల భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.
గడచిన పదేండ్లలో పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వతహాగానే ఉద్యోగులకు పనిభారం పెరిగింది. దీనివల్ల ఆలయాల్లో రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు అధికారులు తెలిపారు. క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా నిర్ధారించిన ఈ 204 పోస్టుల్లో సహాయ కమిషనర్ పోస్టులకు సర్వీస్ రూల్స్ ఫైనలైజ్ కావాల్సి ఉన్నదని తెలిపారు. పదోన్నతుల ప్రక్రియ కూడా చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. 34 ఇంజినీర్ పోస్టులను నేరుగా భర్తీ చేయడమో లేక ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.