మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 00:49:23

తాసిల్దార్‌ లంచావతారం

తాసిల్దార్‌ లంచావతారం

  • పట్టాలిస్తానని లక్షలు వసూలు
  • 100 మంది నుంచి రూ.40 లక్షల వరకు స్వాహా!
  • ఆకస్మిక బదిలీతో వ్యవహారం బహిర్గతం
  • చింతలమానేపల్లి తాసిల్‌ ఎదుట రైతుల ఆందోళన
  • డబ్బులు తిరిగి ఇస్తానని చీటీలు రాసిచ్చిన తాసిల్దార్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: భూ సమస్యలు పరిష్కరించాల్సిన ఓ తాసిల్దార్‌ లంచావతారం ఎత్తాడు. ఎలాంటి భూములైనా సరే పట్టాలిస్తానని నమ్మబలికి అమాయక రైతుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. తీరా ఆ అధికారి బదిలీ అయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు తాసిల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో అసలు విషయం బయటపడింది. రెండు, మూడు నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచలనం రేపింది.

26 గ్రామాల రైతుల నుంచి..

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని సుమారు 26 గ్రామాలకు చెందిన వందమంది రైతులకు పట్టాలు ఇప్పిస్తానని తాసిల్దార్‌ ఖాజానియాజొద్దీన్‌ లక్షలు వసూలు చేశా డు. భూ సమస్యను బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు మొదలుకొని.. రూ.1.70లక్షల వరకు దం డుకున్నాడు. తాసిల్దారే పట్టాలు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులంతా నమ్మి రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఈ తాసిల్దార్‌.. వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించి మరీ రైతులకు పట్టాల ఆశచూపి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తున్నది.

తరలివచ్చిన బాధిత రైతులు..

తాసిల్దార్‌ ఖాజానియాజొద్దీన్‌ ఈ నెల 27న బదిలీ అయ్యారు. కలెక్టరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విషయం తెలుసుకున్న  బాధిత రైతులు గురువారం తాసిల్‌ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు దిగారు. తాసిల్దార్‌ చాంబర్‌లోకి చొచ్చుకెళ్లి ఆయన్ను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సై రాంమోహన్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నిలదీసిన రైతులందరికి తిరిగి డబ్బులు ఇస్తానని తాసిల్దార్‌ చీటీలపై రాసి ఇవ్వడం గమనార్హం.

 1.70 లక్షలు తీసుకున్నడు..

మా ఊరి శివారులోని సర్వే నంబర్‌ 174/57లో మూడెకరాల భూమిని పట్టా చేసి ఇస్తానని తాసిల్దార్‌ రూ.1.70 లక్షలు తీసుకున్నాడు. రెండు, మూడు నెలల సంది తిప్పుకుంటున్నడు. రేపు, మాపు అంటూ తప్పించుకుంటున్నడు. ఇప్పుడు సార్‌ బదిలీ అయ్యిండని తెలిసి ఇక్కడికి వచ్చిన. నిలదీస్తే నా డబ్బులు నాకు ఇస్తానని చీటీ రాసిచ్చిండు. సార్లు మాకు న్యాయం చేయాలి. 

- ఎర్రబోయిన నర్సయ్య, డబ్బా గ్రామం, మం: చింతలమానేపల్లి 

ఐదెకరాలు పట్టా చేస్తానన్నడు

మా ఊరి శివారులోని సర్వే నంబర్‌ 91/153లో 5 ఎకరాలు, సర్వే నంబర్‌ 70/సీలో 5 ఎకరాలు పట్టాచేసి ఇస్తానని తాసిల్దార్‌ రూ.70 వేలు తీసుకున్నడు. రేపు.. మాపంటూ జరిపిండు. ఇప్పుడేమో బదిలీ మీద పోతున్నడు. గిదేందని అడిగితే నా డబ్బులు నాకిస్తానని చీటి రాసి ఇచ్చిండు.

- అడప జనార్దన్‌, చింతలమానేపల్లి


logo