శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:14:25

తడి,పొడి చెత్తను వేరుచేయాలి

తడి,పొడి చెత్తను వేరుచేయాలి
  • ప్లాస్టిక్‌ వాడితే జరిమానా : మంత్రి హరీశ్‌రావు
  • సిద్దిపేటలో ఇంటింటికీ వెళ్లి అవగాహన

సిద్దిపేట ప్రతినిధి, నమస్తేతెలంగాణ: తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హరీశ్‌రావు సిద్దిపేటలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఉదయం 6.30 నుంచి ఉదయం 11 గంటల వరకు ఒకటో వార్డులోనే ఇంటింటికి తిరిగారు. చెత్త బుట్టలను పరిశీలించి తడి,పొడి చెత్తను ఎలా వేరు చేస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని 1, 22వ వార్డుల్లో అవగాహన సదస్సులకు, రైతుబజారులో ఏర్పాటు చేసిన రూ.5కే భోజనామృత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలంటే అందరిలో మార్పు రావాలన్నారు. 1, 22వ వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేశామని ఇండ్లల్లో వివాహ, శుభాకార్యాలు జరిగితే ప్లాస్టిక్‌ ప్లేట్లకు బదులు స్టీల్‌ పాత్రలను వాడాలని సూచించారు. ఇకపై ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగితే స్టీల్‌ బ్యాంకులోని వస్తువులను తీసుకెళ్లి వాడుకోవాలని, ప్లాస్టిక్‌ వాడితే జరిమానా విధిస్తామన్నారు.


logo