హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి. కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-2008లో నష్టపోయిన బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విధివిధానాల ఖరారు బాధ్యతను మం త్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో కూడిన సబ్ కమిటీకి అప్పగించింది. సబ్ కమిటీ సూచన మేర కు నిరుడు సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు.
రెండు వా రాల్లోగా నియామక పత్రాలు ఇస్తామని చెప్పి, మూడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్స్ ఇవ్వలేదంటూ సుమా రు 200 మంది అభ్యర్థులు శుక్రవారం ప్రజాభవన్‌కు తరలివచ్చారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పలుమార్లు చర్చలు జరిపినా అభ్యర్థులు పట్టువీడలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రాత్రి 7 గంటలకు డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆందోళన విరమించారు. మరోవైపు.. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, జీవో 81ను అమలు చేయాలని వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాభవన్‌కు తరలివచ్చారు. జీవో 81 ప్రకారం 3,797 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉన్నదని చెప్పారు.