SLBC | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట్టిదిబ్బలు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. కాగా ఈ సొరంగాన్ని తవ్వుతున్న యంత్రం ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? 2006లో మొదలైన ఈ టన్నెల్ తవ్వకానికి సుదీర్ఘ సమయం ఎందుకు పడుతున్నది? వంటి ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తవ్వడానికి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) టెక్నాలజీ ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సొరంగాల తవ్వకాన్ని చేపట్టేందుకు రోబోటిక్ ఎస్కవేషన్ సిస్టమ్, గ్రిప్డ్ బోరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చా యి. రెండు దశాబ్దాల క్రితం కేవలం కొన్ని సంప్రదాయ పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉండేవి.
ప్రధానంగా డ్రిల్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం), టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం), మైక్రో టన్నెలింగ్ విధానాలు ప్రధా నం. సొరంగం తవ్వకాల్లో డీబీఎం విధానం ఉపయోగించడం వల్ల భూప్రకంపనాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి డ్రైనేజీ, తాగునీటి పైపులు వంటి మైక్రో టన్నెలింగ్ వ్యవస్థలకు మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. భూమిపొరలను ఏమాత్రం ప్రభావితం చేయకుండా సొరంగం తవ్వాలంటే టీబీఎం టెక్నాలజీనే విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడానికి ఈ టీబీఎం యంత్రాన్నే వాడుతున్నారు.
మధ్యలో బయటకు పోవడానికి ఎలాంటి అవకాశంలేకుండా ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టంగా ఉన్న సొరంగాల్లో ఎస్ఎల్బీసీ ఒకటి. పైగా ఈ టన్నెల్‌కు ఒకవైపున నదీప్రవాహం, మరోవైపున అభయారణ్య ప్రాంతం ఉన్నది. దీంతో టీబీఎం టెక్నాలజీ ద్వారానే సొరంగాన్ని తవ్వాలని నిర్ణయించారు. టీబీఎం వాడకం జరుగుతున్న టన్నెల్ ప్రాం తంలో విధిగా జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు నీరు ఉబికివచ్చే ప్రమాదం ఉన్నదాలేదా? అని హైడ్రాలాజికల్ విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. సమస్యలు లేకపోతేనే టీబీఎం మిషన్‌ను వాడాల్సిఉంటుంది.
టన్నెల్ బోరింగ్ మిషన్ సాయంతో సొరంగాలను అడ్డంగా, ఎక్కువ వ్యాసార్థంతో తవ్వు తాం. టీబీఎం మిషన్ పరిమాణం సైతం అంతే ఎక్కువగా ఉంటుంది. టన్నెల్ వ్యాసం (డయా) ఎంత ఉండాలన్న దానిని బట్టి మిష న్ పొడవు, వెడల్పు ఆధారపడి ఉంటుంది. టీబీఎంలో రెండు భాగాలు ఉంటాయి. సొరంగాన్ని తొలిచేది బేరింగ్ అయితే, ఆ వెనకనే సిమెంట్ సెగ్మంట్లను అమర్చే మరో వ్యవస్థ రెండోది.
ఈ రెండు వ్యవస్థలను కలిపే మొత్తం గా ‘టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)’గా పిలుస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లోని టీబీఎం పొడవు 12.5 మీటర్లు. బ్యాకప్ సిస్టమ్ పొడ వు 120 మీటర్లు. ఇక ఈ బ్యాకప్ సిస్టమ్ రెండంతస్తుల్లో ఉంటుంది. పైఅంతస్తులో ప్ర ధానంగా కన్వేయర్ సిస్టమ్, గ్రౌటింగ్ సిస్టమ్, లేజర్ గైడెన్స్ సిస్టమ్ (టన్నెల్ తొలిచే పాయింట్లు), కమ్యూనికేషన్, డాటా అక్విసిఝన్, సేఫ్టీ కంటెయినర్లు, సిమెంట్ సెగ్మెంట్లు, మోటర్లు, అయిల్స్ మెటీరియల్స్ ఉంటాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లోని టీబీఎం గరిష్ఠ సామర్థ్యం గంటకు 2.5 మీటర్లు. కానీ, ప్రస్తు తం అది 24 గంటల్లో గరిష్ఠంగా 6 మీటర్ల వర కు మాత్రమే తొలుస్తున్నది. దీనికి కారణం ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గం పూర్తిగా రాతిపొరలతో నిండి ఉన్నది. మరోవైపు ప్రస్తుతం తవ్విన 14 కిలోమీటర్ల సొరంగం పొడవునా వెంటిలేషన్ కోసం (గాలి, వెలుతురు) ఎక్కడా ఒక్క సాఫ్ట్ పాయింట్ కూడా లేదు. ఆక్సిజన్‌ను పూర్తిగా బయట నుంచే వెం టిలేషన్ ట్యూబ్‌ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి. సొరం గం పొడవు పెరిగిన కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం తో మనుషులు పనిచేసే సామర్థ్యం పడిపోతున్నది.
సాధారణంగా పనిపూర్తయిన వెంటనే ఆ పనికి వినియోగించిన యంత్రాలను బయటకు తీసుకొస్తారు. కానీ టీబీఎంలను మాత్రం సొరంగాల్లోనే పూడ్చిపెడతారు. కారణం వాటి ని బయటకు తీయలేం. వివరంగా చెప్పాలం టే.. ఓ టీబీఎం బోరింగ్ డయా 10 మీటర్లు ఉందనుకొంటే, ఆ వ్యాసంతోనే ఆ మిషన్ రాతిపొరలను తొలుస్తూ ముందుకు వెళ్తుంది. అటు తరువాత సొరంగం కూలిపోకుండా సిమెంట్ సెగ్మెంట్లను అమర్చుతుంది. దీంతో ఫినిషింగ్ డయా 9.2 మీటర్లకు పడిపోతుంది.
దీంతో 10 మీటర్ల డయా కలిగిన టీబీఎం అం దులోనే చిక్కుకుపోతుందన్న మాట. అందుకే టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ముందుకు మాత్రమే వెళ్లగలదు. ప్రస్తుతం రెండువైపుల నుంచి సొరంగం తవ్వుతున్నారు. రెండువైపులా సొరంగం కలిసిన వద్దనే టీబీఎంలు నిలిచిపోతాయి. పనులన్నీ పూర్తయ్యాక సదరు టీబీఎంలు సొరంగంలోనే ఒక పక్కకు తవ్వకాలు చేసుకొని అందులోకి వెళ్లిపోతాయి. అనంతరం వాటి బ్యాకప్ సిస్టమ్‌ను వేరుచేస్తారు. బేరింగ్‌ను అందులోనే సిమెంట్ సెగ్మెంట్లతో పూడ్చివేస్తారు. అలా బోరింగ్ మిషన్ శాశ్వతంగా అందులోనే ఉండిపోతుంది.
టన్నెల్ బోరింగ్ మిషన్‌లో తొలి భాగమైన బేరింగ్ మిషన్‌లోని కట్టర్లు భూమి, రాతిపొరలను తొలుచుకుంటూ ముందుకు వెళ్తుంటాయి. బేరింగ్ మిషన్‌పై వెనకవైపు నుంచి పీడనం (ఒత్తిడి) కలిగిస్తుంటారు. అలా ఆ ఒత్తిడితో కట్టర్లు ముందుకు కదులుతూ రాతిపొరలను తొలుస్తాయి. ఆ తొలగించబడిన రాతి, మట్టి వ్యర్థాలను (మ్యూక్) మొత్తం కూడా కన్వేయర్ సిస్టమ్‌లోకి చేరుస్తారు.
అవి అక్కడి నుంచి బెల్ట్‌పైకి చేరి అటునుంచి బయటకు వెళ్లిపోతాయి. బేరింగ్ తొలిచే క్రమంలో కెమికల్స్ కలిపిన, లేదంటే సిమెంట్‌ను అత్యధిక పీడనంతో పంపింగ్ చేస్తూ గ్రౌటింగ్ చేస్తారు. తొలచిన భాగం నుంచి మట్టి, రాళ్లు కూలిపోకుండా, నీరు ఉబికి రాకుండా ఇది పూర్తిగా గట్టి పరుస్తుంది. బేరింగ్ మిషన్ మూడు మీటర్లు ముందుకు వెళ్లగానే సిమెంట్ సెగ్మెంట్లను మిషన్ అమర్చుతుం ది. ఈ సిమెంట్ సెగ్మెంట్లను కూడా అక్కడే తయారు చేస్తారు. టీబీఎం ఆ విధంగా సొరంగ మార్గాన్ని పూర్తిచేస్తుంది.
టీబీఎం డయా: 10 మీటర్లు
ఫినిషింగ్ డయా : 9.2 మీటర్లు
బోరింగ్ మిషన్ పొడవు: 12.5 మీటర్లు
బ్యాకప్ సిస్టమ్‌తో కలిపి మొత్తం: 120 మీటర్లు
బరువు: 1,500 టన్నులు
కన్వేయర్ సిస్టమ్ సామర్థ్యం: 800 టన్నులు
కన్వేయర్ సిస్టమ్ పొడవు: 22.5 కిలోమీటర్లు
ఇన్స్టాల్డ్ ఎలక్ట్రికల్ మోటర్ల సామర్థ్యం: 5,100 హెచ్‌పీ
గరిష్ఠంగా ఒక గంటకు తొలచే సామర్థ్యం: 2.5 మీటర్లు