ములుగు, మే17(నమస్తేతెలంగాణ) : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మందిని శనివారం ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు), వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ పరిధితో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎలిమిడి, ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గ్రూప్‌లుగా విడిపోయి అడవిలో సంచరిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
శుక్రవారం వెంకటాపురం పీఎస్ పరిధిలో పాలెంవాగు ప్రాజెక్టు వద్ద మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు కుంజం లక్క, మారిగల సుమతి, పార్టీ సభ్యులు మడకం కోసి, పొడియం జోగి, మడవి సీమ, ముసాకి రంజును అరెస్ట్ చేశారు. మురుమూరు వద్ద డివిజన్ కమిటీ సభ్యుడు కట్టం భీమ్, ఏరియా కమిటీ సభ్యురాలు మడకం మాసే, పార్టీ సభ్యులు సోడి ఉంగి, వంజాం ముకే, హేమల సుక్కి, కుంజం ఉంగా, పూనెం భీమేను అరెస్టు చేశారు.
గుట్టల గంగారం గొత్తికోయగూడెంలో ఏరియా కమిటీ సభ్యుడు కట్టం జోగా, పార్టీ సభ్యులు పూనెం భీమే, నుపా గంగి, హేమల సన్నీ, ఊకె మాసా, పొడియం లక్క, ఉండెం సోమడు ఉన్నట్టు పేర్కొన్నారు. వీరి నుంచి మూడు 6 ఎంఎం రైఫిల్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, 303 రైఫిల్, నాలుగు 8 ఎంఎం రైఫిల్, 12 బోర్ వెపన్స్, రెండు గ్రానైట్స్, 17 మ్యాగజైన్లు, 180 రౌండ్ల బుల్లెట్స్తోపాటు రూ.58,155, నాలుగు వాకీటాకీలు, ఆరు రేడియోలు, 9 చార్జింగ్ బ్యాటరీలు, ఆరు పెన్‌డ్రైవ్‌లు, ఆరు మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.