హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సైబర్‌క్రైం పోలీసులు కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తె చ్చారు. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, సిమ్‌కార్డు పొం దడం ద్వారా బ్యాంకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశా రు. అతని నుంచి రూ.18 లక్షల నగదు, కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌కు చెందిన మహ్మమద్ సమీయుద్దీన్ ఇరిగేషన్ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి, 2013లో పదవీ విరమణ చేశాడు.
ఎస్బీఐ, కెనరా బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు దాచుకున్న ఆయన 2022లో చనిపోయాడు. ఆ ఖాతాల్లోని సొమ్ము విషయాన్ని సమీయుద్దీన్ గతంలో తనతో కలిసి పనిచేసిన జహంగీర్, మహ్మద్ ఆసిఫ్ పాషాకు చెప్పాడు. దీంతో వారిద్దరు ఈ ఏడాది జూన్‌లో సమీయుద్దీన్ సిమ్‌కార్డును బ్లాక్ చేయించారు. ఆయన పేరుతో నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేసి, కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు. దానితో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌లను యాక్సెస్ చేయడం ద్వారా సమీయుద్దీన్ ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా చేశారు. కాగా, సమీయుద్దీన్ సోదరి సబీహా సుల్తానా ఫోన్ నంబర్‌కు ఎస్బీఐ ఖాతాను అనుసంధానించి ఉండటంతో ఆయన ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీనిపై ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆసిఫ్ పాషాను అరెస్టు చేశారు. మరో నిందితుడు జహంగీర్ పరారీలో ఉన్నాడు.