గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న పోలీసులపై వేటు పడింది. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఎస్సైలు అంబారియా, మారుతి నాయక్, కానిస్టేబుళ్లు మధు, వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు
ఈ ఏడాది మే 31వ తేదీన సంగారెడ్డి మనూర్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ నలుగురు గంజాయి స్మగ్లర్లకు సహకరించారని విచారణలో తేలింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో సనత్పూర్లో ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. అందులోని 120 కిలోల గంజాయిని తమ వాహనంలోకి ఎక్కించి, నేరస్తుడిని వదిలేశారని తెలిసింది. అలాగే ఇదే సిబ్బంది ఏడు నెలల క్రితం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నిజామాబాద్‌లోని వర్ని దగ్గర అడ్డుకుని అక్కడి నుంచి వారిని నారాయణఖేడ్ తీసుకెళ్లారు. 400 ప్యాకెట్ల గంజాయిని తీసుకుని నేరస్తుడిని వదిలేశారని విచారణలో తెలిసింది.ఈ క్రమంలోనే ఆ నలుగుర్ని ఐజీ సస్పెండ్ చేశారు.
అక్రమాలకు పాల్పడిన పోలీసులపై ఎన్డీపీఎస్ కేసు నమోదుకు లీగల్ ఓపెన్ తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఐజీ తెలిపారు. మత్తు పదార్థల కట్టడిలో అంకిత భావంతో పనిచేయాలని 9 జిల్లాల ఎస్పీలకు ఐజీ సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారు. గ్యాంబ్లింగ్, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు.