ఖైరతాబాద్, మే 14 : కాంగెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా గుర్తించలేదని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన సమాచార పత్రాలను తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్, విఠల్‌తో కలిసి జడ్సన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖల్లో 2,67,316 పోస్టులను ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, తాను ఎమ్మెల్సీగా గెలుపొందితే వీటన్నింటినీ భర్తీ చేసేదాకా పోరాడుతానని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారని, కాని సీఎం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు.