హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): రూ.2.45 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమైన ఘటనలో ఈక్విటాస్ బ్యాంకు మేనేజర్‌పై సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మలక్‌పేటకు చెందిన తిరుమల బ్యాంకు 2016 నుంచి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ వస్తున్నది. తమను బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ రూ.2.45 కోట్లకు మోసం చేశారని గ్రహించిన తిరుమల బ్యాంకు సీఈఓ శోభనాద్రి సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీల చోరీ కేసులో నిందితుల అరెస్టు
తిప్పర్తి, జనవరి 27: రోడ్డు వెంట నిలిపి ఉంచిన లారీలను చోరీ చేస్తున్న నిందితులను అరెస్టు చేసి, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ డీఎస్పీ కొలను శివరామ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం తిప్పర్తి సెంటర్లో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్సై సాయిప్రశాంత్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నంబర్‌ప్లేట్ లేని రెండు కార్లలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిని నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అ యిటిపాములకు చెందిన మెండె వెంకన్న, గుంజేటి శ్రీనివాస్, కొర్పుల సాయికుమార్, కొత్తగూడెం జిల్లాకు చెందిన అరిక రవిగా గుర్తించారు. వీరు కొంతకాలంగా రాత్రి సమయంలో రహదారి పక్కన నిలిపి ఉంచిన వాహనాలను చోరీ చేసి విజయవాడలోని ఆటోనగర్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శివరామ్‌రెడ్డి తెలిపారు.